ట్రంప్ విధానాలతో వెల్లువలా ఉద్యోగాలు

ట్రంప్ విధానాలతో వెల్లువలా ఉద్యోగాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం 'అమెరికా ఫస్ట్‌' విధానాల్లో భాగంగా తెచ్చిన మార్పులు ఆర్థిక వ్యవస్థపై ప్రతిఫలిస్తున్నాయి. అధిక దిగుమతి సుంకాలు విధించి దేశీయంగా వస్తు, సేవల ఉత్పత్తికి ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా నిరుద్యోగిత శాతం భారీగా తగ్గుముఖం పడుతోంది. మరోసారి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, వినిమయాలు జోరందుకున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో ఉద్యోగాలు తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి. ఒక్క మే నెలలోనే 2,23,000 కొత్త కొలువులు వచ్చాయి. దీంతో నిరుద్యోగిత శాతం 18 ఏళ్లలో 3.8 శాతంగా నమోదైంది. దీంతో హైస్కూల్ గ్రాడ్యుయేట్స్ లో 3.9 శాతం, నల్లజాతీయుల్లో 5.9 శాతం మాత్రమే నిరుద్యోగిత కనిపించింది. గంటకు చెల్లించే మొత్తం సగటు గత ఏడాదితో పోలిస్తే 2.7 శాతం పెరిగింది. అకౌంటింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో 31 వేలు, వైద్యసేవలలో 32 వేలు, తయారీ రంగంలో 18 వేలు, నిర్మాణ రంగంలో 25 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఆయా ఉద్యోగులకు జీతాలు కూడా ఆకర్షణీయమైన స్థాయిలో భారీగానే పెరిగాయి. ప్రైవేటు సెక్టార్‌ ఉద్యోగుల సగటు వేతనాల్లో 0.1 వృద్ధి కనిపించింది.

2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం (ద గ్రేట్ రిసెషన్) తర్వాత 9 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ విస్తరణ ఇంత దీర్ఘకాలం పాటు నిలకడగా కొనసాగడం ఇది రెండోసారని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ విధించిన పన్నుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎదురయ్యే వ్యాపార వివాదాల గురించి, విపణి యుద్ధాల గురించి పట్టించుకోనక్కర్లేదని అమెరికన్ వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. నిరుద్యోగులు తగ్గిపోవడంతో తగిన సంఖ్యలో ఉద్యోగులు దొరకడం లేదని వ్యాపారవర్గాలు ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో ఆరు నెలలు అంత కంటే ఎక్కువ కాలంగా ఖాళీగా ఉన్నవారిని వెతికి పట్టుకుని పిలిచి మరీ ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తోంది. ఉద్యోగాలు రావడంతో అమెరికన్లు మరోసారి విరివిగా కొనుగోళ్లు చేస్తున్నారు. తాజా ఉద్యోగిత నివేదికపై అధ్యక్షుడు ట్రంప్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 50 ఏళ్లలో అతి తక్కువ నిరుద్యోగిత నమోదైందని ట్వీట్ చేశారు. తాను చేపట్టిన పన్ను కోతలు సత్ఫలితాలనిస్తున్నాయని అన్నారు. తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కుతోందని తెలిపారు.