70 దిశగా డాలర్‌ రూపీ?

70 దిశగా డాలర్‌ రూపీ?

ఒకవైపు ముడి చమురు ధరలు చెమటలు పట్టిస్తుంటే... మరోవైపు డాలర్‌తో రూపాయి విలువ ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తోంది.  సాధారణంగా డాలర్‌ పెరిగితే చమురు ధరలు క్షీణించడం, డాలర్‌ తగ్గితే చమురు ధరలు పెరగడం రివాజు. కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నిర్ణయాల ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో కొనుగోళ్ళ సామర్థ్యం పెరుగుతోంది. పైగా కంపెనీలకు ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడి మళ్ళీ అమెరికాకు వచ్చేస్తోంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరగడంతో బాండ్లకు మళ్ళీ డిమాండ్‌ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో డాలర్‌ పెరుగుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే ముడి చమురు ధరలు మరీ పెరగకుండా డాలర్‌ అడ్డుపడుతూ వచ్చింది. ఉత్పత్తిని కంట్రోల్‌ చేయాలన్న ఒపెక్‌ దేశాల నిర్ణయం, తాజా గల్ఫ్‌ సంక్షోభాల కారణంగా ముడి చమురు ధరలు తగ్గడం లేదు. పైగా ఇరాన్‌ సంక్షోభం నేపథ్యంలో పెరుగుతోంది.

బక్కచిక్కిన రూపాయి
దిగుమతుల్లో ముడి చమురుకే భారీ ఎత్తున డాలర్లు కొనాల్సి రావడంతో రూపాయి బక్కచిక్కుతోంది. పైగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా ఆశించినస్థాయిలో లేకపోవడంతో రూపాయి పతనాన్ని ఆపడం ఆర్బీఐ కష్టంగా మారుతోంది. డాలర్‌తో రూపాయి విలువ 67కు చేరిన మరుక్షణం ఆర్బీఐ రంగంలోకి దిగి డాలర్ల సరఫరా పెంచింది. దీంతో రూపాయి పతనం ఆగింది. అయితే విదేశీ బ్యాంకులు మాత్రం ఆర్‌బీఐ చర్యలపై పెదవి విరుస్తున్నాయి. రూపాయి పతనం ఆపడం ఆర్బీఐ వల్ల కాదని అంటున్నాయి. డాయిష్‌ బ్యాంక్‌, డీబీఎస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, ఎస్‌ బ్యాంక్‌లు మాత్రం ఏడాది చివరికల్లా డాలర్‌తో రూపాయి విలువ 70ని దాటుతుందని అంచనా వేస్తున్నాయి. ఎకనామిక్స్‌ టైమ్స్ పత్రిక చేసిన సర్వేలో 20 మందికిగాను 18 మంది రూపాయి మరింత బలహీనమౌతుందని తేలింది.