మార్కెట్‌లోకి డైమండ్‌ మాస్కులు .. ధ‌ర ఎంతంటే..?

మార్కెట్‌లోకి డైమండ్‌ మాస్కులు ..  ధ‌ర ఎంతంటే..?

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో మాస్కులకు గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి కావడంతో రకారకాలు మోడల్స్‌లో మాస్కులను తయారు చేస్తున్నారు. వినియోగదారులు కూడా వినూత్నంగా తయారు చేసిన మాస్కులపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్తగా మాస్కులను తయారుచేయాలని సూరత్‌లోని ఒక నగల దుకాణ యజమాని దీపక్ చోక్సీకి ఆలోచన వచ్చింది. ఒక వ్యక్తి ఆయన షాపుకు వచ్చి డైమండ్... బంగారంతో వధూవరుల కోసం ప్రత్యేకమైన మాస్కులు చేయాలని కోరాడు. దాంతో ఇదేదో బాగుందే అని అనుకున్నాడు చోక్సి. అందుకే 1.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య డైమండ్‌తో చేసిన మాస్కులను తయారు చేయాలనుకున్నాడు నగల షాపు యజమాని.

లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక కస్టమర్ సూరత్‌లోని నగల దుకాణానికి వెళ్లాడు. వధూవరులకు ప్రత్యేకమైన మాస్కులు కావాలని డిమాండ్ చేశాడు. డైమండ్‌లతో మాస్క్‌లను తయారు చేయించాడు. వాటిని చూసిన కస్టమర్ అవి నచ్చడంతో కొనుగోలు చేశాడు. కొత్తగా అనుకరించాలనుకునేవాళ్లు రాబోయే రోజుల్లో ఇలాంటి మాస్కులను అడుగుతారని భావించి మరికొన్నింటిని తయారుచేశాడు షాపు యజమాని. వీటిని తయారు చేయడానికి స్వచ్ఛమైన వజ్రాలు..అమెరికన్ వజ్రాలను బంగారంతో ఉపయోగించాడు. అమెరికన్ వజ్రాలతో పాటు పసుపు బంగారం కూడా ఉపయోగించిన మాస్కు ధర 1.5 లక్షలు. తెలుపు బంగారం..నిజమైన వజ్రాలతో తయారు చేసిన మరో మాస్కు ధర 4 లక్షలకు విక్రయిస్తున్నారు.

ఇక...ఈ మాస్కుల తయారీకి ఉపయోగించిన క్లాత్.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని తెలిపాడు దుకాణ యజమాని. కస్టమర్ల కోరిక మేరకు ఈ మాస్కులలో ఉపయోగించిన వజ్రాలు.. బంగారాన్ని బయటకు తీసి.. వాటితో మరో కొత్త ఆభరణాలను తయారుచేసుకోవటానికి అవకాశం ఉంది. ఇంట్లో పెళ్లిళ్లు ఉండటంతో నగలు కొనడానికి జ్యువెలరీ షాపులకు వస్తున్నారు జనం. అక్కడ కనిపించిన డైమండ్ మాస్కులను కొనుగోలు చేస్తున్నారు. షాపులో నగల కంటే.. డైమండ్ మాస్క్‌లే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయట.