వయసు కాదు.. ఫిట్‌నెస్‌ ముఖ్యం

వయసు కాదు.. ఫిట్‌నెస్‌ ముఖ్యం

ఫిక్సింగ్ ఉదంతంలో ఇరుక్కుని రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌-11లో అడుగుపెట్టింది చెన్నై సూపర్‌కింగ్స్‌. ఫిక్సింగ్ ఉదంతం మాత్రం చెన్నై ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన సారధ్య విలువలను బయటపెట్టడంతో చెన్నై మూడోసారి కప్పును ముద్దాడింది. ఐపీఎల్‌ సీజన్‌-11లో ఆడిన  ప్రతిసారీ సన్‌రైజర్స్‌ను ఓడించిన చెన్నై.. ఫైనల్లోనూ బ్యాటింగ్ లో చెలరేగడంతో విజయం సాధించి విజేతగా నిలిచింది. ఆదివారం ముంబైలో జరిగిన ఫైనల్లో ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ అజేయ శతకంతో చెలరేగడంతో మరోమారు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎదురులేకుండా పోయింది.

మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోని మాట్లాడుతూ.. ఐపీఎల్ కి ముందు జట్టులోని ఆటగాళ్ల వయసు గురించి అందరూ చర్చించారు. ఆటగాళ్లకు వయసు కంటే ముఖ్యమైనది ఫిట్‌నెస్‌ అని ధోని అన్నారు. జట్టులోని ఆటగాళ్లు ఎంతో ఫిట్‌గా ఉన్నారు. ఉదాహరణకు టోర్నీలో రాణించిన అంబటి రాయుడి(33)నే తీసుకోండి. బ్యాట్ తో  మైదానంలో చాలా సమయం గడిపిన తర్వాత కూడా.. ఫీల్డింగ్ అద్భుతంగా చేసాడు. అతనికి వయసు అడ్డంకే కాదు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే.. అది అసలు సమస్యే కాదన్నారు ధోని. ఏ జట్టు కెప్టెన్‌ కు అయినా.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ముఖ్యమని తెలిపారు. ఆటగాళ్ల బర్త్ ఇయర్.. ఏజ్ ఇంపార్టెంట్ కాదు మైదానంలో ప్రదర్శనే  ముఖ్యమన్నారు కెప్టెన్ కూల్. టోర్నీలో ప్రతి విజయం ప్రత్యేకమైందే అని ధోనీ అన్నారు. 

Photo: FileShot