ముచ్చటగా మూడో రాత్రి @అరవింద్ కేజ్రివాల్ 

ముచ్చటగా మూడో రాత్రి @అరవింద్ కేజ్రివాల్ 

ప్రజాసేవలు నిలిపివేసిన వారికి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజల తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రి చేస్తోన్న సర్జికల్ స్ట్రైక్ ముచ్చటగా మూడోరాత్రికి చేరింది. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) అనిల్‌ బైజల్‌ కార్యాయలంలో మంత్రులతో కలిసి సీఎం కేజ్రీవాల్‌ చేస్తోన్న ధర్నా ఈరాత్రి మూడవది. సోమవారం సాయంత్రం నుంచి కేజ్రీవాల్‌, మంత్రులు సత్యేంద్ర జైన్‌, మనీశ్‌ సిసోడియా, గోపాల్‌రాయ్‌లు ధర్నాకు దిగారు. తాము చేస్తున్న ధర్నాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మంత్రులు మండిపడుతున్నారు. తమ డిమాండ్లను కేంద్రం, ఎల్జీ ఆమోదించాలంటూ మంత్రి సత్యేంద్ర జైన్‌ నిన్నటి నుంచి ఆమరణ దీక్ష చేపట్టారు. ఈరోజు ఆయనకు తోడుగా మరో మంత్రి మనీశ్‌ సిసోడియా ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు వెల్లడించారు. 

ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి సిసోడియా ఆప్ నేతలు అంటున్నారు. గత మూడు నెలలుగా ఐఏఎస్‌ అధికారులు కేవలం ఆఫీసులకు వచ్చి ఫైళ్ల మీద సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని.. ఈ విషయాన్ని తాము పలుమార్లు ఎల్జీకి ఫిర్యాదు చేసినా ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కేజ్రీవాల్‌, ఆయన మంత్రులు మెరుపు ధర్నాకు దిగారు.