ఎస్‌బీఐకి మొండి బకాయిల ఎఫెక్ట్‌

ఎస్‌బీఐకి మొండి బకాయిల ఎఫెక్ట్‌

మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బిఐ)కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రికార్డ్‌ స్థాయి నష్టాలు వచ్చాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యు4) బ్యాంక్‌ ఏకంగా రూ.7,718 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.2,815 కోట్ల నికర లాభం వచ్చిందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వివరించారు. సీక్వెన్షియల్‌గా చూసినా నికర నష్టాలు పెరిగాయని, గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,416 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఆయన వివరించారు. సంస్థకు మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయని,  కామన్‌ ఈక్విటీ టైర్‌ వన్‌ మూలధనం ఈ ఏడాది మార్చి నాటికి 0.27% వృద్ధితో 9.68 శాతానికి పెరిగిందని ఆయన వివరించారు. భారీ నష్టాలు ప్రకటించినప్పటికీ, ఎస్‌బీఐ షేర్‌ మాత్రం  దూసుకుపోయింది. బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్‌ 3.7 శాతం లాభంతో రూ. 254 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 6 శాతం లాభంతో రూ.260ను తాకింది. బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు..

  • 2016-17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.10,993 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 119 శాతం పెరిగి రూ.24,080 కోట్లకు చేరాయి.
  • మొండి బకాయిలతోపాటు తక్షణ ఖర్చుల కోసం కేటాయింపులు వార్షిక ప్రాతిపదికన రూ.11,740 కోట్ల నుంచి రూ.28,096 కోట్లకు పెరిగాయి.
  • నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.19,974 కోట్లకు పెరిగింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం 0.26 శాతం తగ్గి 2.67 శాతానికి చేరింది.  
  • గతంలో రైటాఫ్‌ చేసిన రుణాల రికవరీ 21.18 శాతం వృద్ధి చెందింది.
  • మార్చితో ముగిసిన మూడు నెలల్లో ఎస్‌బిఐ రాబడి రూ.68,436 కోట్లకు చేరుకుంది.  
  • గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రాబడి రూ.2,59,664 కోట్లకు పెరిగింది. 
  • గత మార్చి చివరి నాటికి 6.90 శాతంగా ఉన్న బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు ఈ మార్చి ముగిసేసరికి 10.91 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పిఎలు 3.71 శాతం నుంచి 5.73 శాతానికి ఎగబాకాయి.
  • స్థూల ఎన్‌పిఎలు రూ.1,12,343 కోట్ల నుంచి రూ.2,23,427 కోట్లకు చేరుకోగా, నికర ఎన్‌పిఎలు రూ.58,277 కోట్ల నుంచి రూ.1,10,855 కోట్లకు ఎగబాకాయి.