అధికార దాహం కోసమే ముందస్తుకు వెళ్లారు

అధికార దాహం కోసమే ముందస్తుకు వెళ్లారు

అధికార దాహం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. మోడీ ప్రభంజనాన్ని తట్టుకోలేమన్న భావన టీఆర్ఎస్ పార్టీలో నెలకొందని అన్నారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని తెలిపారు. ఎన్నికల హామీలను ఒక్కటి కూడా టీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న మంత్రి ఎప్పుడూ దళితులను పట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ హమీలను నెరవేర్చలేని సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. రైతు బంధు పథకం అసలైన రైతులకు అందడం లేదు, కౌలు రైతులకు కూడా ఈ పథకం అందాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో ప్రస్తుత ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మహా కూటమి పెద్ద మాయ కూటమి.సబ్ కా సాత్ సబ్ కా వికాస్ బీజేపీ లక్ష్యం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుంది. బీజేపీలో ప్రజలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. రాహుల్ మోడీపై ఆధారాలు లేకుండా అడ్డగోలుగా పిచ్చి కూతలు కూస్తున్నాడు. ప్రతీది రాజకీయం చేయడం రాహుల్ స్థాయిని తగ్గిస్తోంది. రాఫెల్ మీద ఆరోపణలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ఏపీలో ఐటీ దాడులు జరిగితే చంద్రబాబుకు ఎందుకు ఉలుకు. ఆయన పొద్దున లేచిన దగ్గర నుంచి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. సూర్యాపేటలో ప్రధానమంత్రి మోడీ సభ ఉండే అవకాశముందని బండారు దత్తాత్రేయ తెలిపారు.