అత్యాచారం కేసులో దాతి మహారాజ్‌

అత్యాచారం కేసులో దాతి మహారాజ్‌

మరో బాబా దారుణం బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రసిద్ధ శనిధామ్ మందిరం వ్యవస్థాపకుడు దాతి మహారాజ్ పై అత్యాచార ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను తాను దేవుడి అవతారంగా ప్రకటించుకున్న దాతి మహారాజ్‌ బాబాపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ 376, 377, 354, 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండేళ్ల క్రితం దాతి మహారాజ్‌ ఆశ్రమం.. శనిధామ్‌లో బాబా తనను అత్యాచారం చేసినట్టు గతంలో ఆయన శిష్యురాలైన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణ భయం, నలుగురిలో నవ్వుల పాలవుతానని భయపడి ఇన్నాళ్లూ ఈ విషయాన్ని బయటికి చెప్పలేదని ఆమె తెలిపింది. తననే కాకుండా మరెందరో మహిళలను కూడా దాతి బాబా లైంగికంగా వేధించారని.. అత్యాచారం చేశారని ఆమె పేర్కొంది. 

శని శత్రువు కాదు.. మిత్రుడు అనే జ్యోతిష్య సంబంధిత కార్యక్రమం ద్వారా దాతి మహారాజ్ వెలుగులోకి వచ్చారు. పలు జాతీయ వార్తా ఛానెళ్లలో ఆయన శని దేవుడిపై చర్చల్లో పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక వెబ్ సైట్ నడపడంతో పాటు తన అనుచరులను పెంచుకొనేందుకు సోషల్ మీడియాను కూడా విరివిగా వాడుతుంటారు. దాతి బాబాకు ఢిల్లీలోని ఫతేపూర్‌లో ఆఫీసు, దక్షిణ ఢిల్లీలో విశాలమైన ఫార్మ్ హౌస్ కూడా ఉన్నాయి. తాజా ఆరోపణలతో పోలీసులు దాతి మహారాజ్ బాబాపై దర్యాప్తు ప్రారంభించారు.