క్షణాల్లో కోట్లు కొట్టేశారు

క్షణాల్లో కోట్లు కొట్టేశారు

లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటైన మెక్సికో‌ను సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. గతేడాది మాల్‌వేర్‌తో విరుచుకుపడిన హ్యాకర్లు బ్యాంకింగ్ సర్వర్లలో చోరబడి కీలక సమాచారాన్ని దొంగిలించారు. చాలా రోజుల పాటు ఆయా బ్యాంకులు ప్రజలకు సేవలు అందించలేకపోయాయి. తాజాగా మరోసారి మెక్సికో బ్యాంకింగ్ రంగంపై సైబర్ దాడి జరిగింది. దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన బానోర్ట్‌తో సహా చిన్న చితకా బ్యాంకుల సర్వర్లను హ్యాక్ చేసి.. సుమారు 15.4 మిలియన్ డాలర్లు కొల్లగొట్టారు. దీని విలువ భారత కరెన్సీలో అక్షరాల 104 కోట్లు.

ఇంటర్ బ్యాంక్ మనీ ట్రాన్స్‌ఫర్ ‌సిస్టమ్‌లోకి చోరబడి.. ఆ కనెక్షన్ల సాయంతో తమ ఖాతాలకు వందలకొద్ది ఫండ్ ట్రాన్స్‌ఫర్లు చేసుకున్నారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆయా బ్యాంకుల బ్రాంచీలలో నగదు ఉపసంహరణ చేశారు. కాగా.. ఒక బ్యాంకుకు చెందిన పేమంట్ సిస్టమ్స్‌కు చీఫ్‌గా పనిచేస్తున్న అధికారి కొన్ని అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో హ్యాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రంగంలోకి దిగిన కేంద్రబ్యాంక్ విచారణకు ఆదేశించింది. అయితే ఈ దాడిలో వినియోగదారులు వ్యక్తిగత ఖాతాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది.