పోటీ పడి పెరుగుతున్న డాలర్‌, ఆయిల్

 పోటీ పడి పెరుగుతున్న డాలర్‌, ఆయిల్

నిన్న రాత్రి భారీగా క్షీణించిన ముడి చమురు ధరలు మళ్ళీ స్పీడందుకున్నాయి. ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌ ప్రకటించిన వెంటనే 68 డాలర్లకు పడిపోయిన బ్యారెల్‌ చమురు ధరలు తరవాత జోరందకుంది.  అమెరికా మార్కెట్‌లో రాత్రి 69 డాలర్లకు చేరిన చమురు ఇపుడు 70.64 డాలర్లకు అంటే రెండు శాతంపైగా లాభాలతో ట్రేడ్‌ అవుతోంది. ఇక ఆసియా దేశాలు కొనుగోలు చేసే  బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఏకంగా 76.70 డాలర్లకు చేరింది.  ఇరాన్‌పై ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశం నుంచి చమురు సరఫరా తగ్గనుంది చమురు రంగ నిపుణలు హెచ్చరిస్తున్నారు. అమెరికా విధించే ఆంక్షల వివరాలు ఇంకా పూర్తిగా తెలియకున్నా... చమురు సరఫరాపై కచ్చితంగా ఆంక్షల ప్రభావం ఉంటుందని వీరు అంటున్నారు. మరోవైపు ఇవాళ అమెరికా వారంతపు చమురు నిల్వల డేటా కూడా రానుంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.
డాలర్‌ కూడా...
సాధారణంగా డాలర్‌ పెరిగితే చమురు ధరలు తగ్గుతాయి. అలాగే డాలర్‌ క్షీణిస్తే పెరిగుతాయి. గల్ఫ్ దేశాల్లోని తాజా పరిస్థితి కారణంగా ఇటు డాలర్‌ అటు చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. దీనివల్ల భారత్‌ వంటి దేశాలు ముడి చమురు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. డాలర్‌తో రూపాయ విలువ దారుణంగా క్షీణించడం... చమురు ధర ఎక్కువగా ఉండటంతో భారతకు గుదిబండగా మారుతోంది.