తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనా

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోన్న కరోనాతెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న కేసులు, మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తెలంగాణలో రికార్డ్‌స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కాగా..ఏపీలోనూ వైరస్ విజృంభణ చేస్తోంది. ఒక్కరోజే  తెలుగు రాష్ట్రాల్లో 4వందలకు పైగా కేసులతో మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ వదలడం లేదు. రోజు రోజూకూ విరుచుకుపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వైరస్  విస్తరిస్తుండడం గుబులు పుట్టిస్తోంది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కేసుల తీవ్రత అధికమవుతోంది. ఒక్క రోజులోనే రెండు రాష్ట్రాల్లో 4వందలకు పైగా కేసులు నమోదయ్యాయి.

నిన్న తెలంగాణలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 24గంటల్లో 206 మందికి వైరస్ సోకగా..ఒక్కరోజే 10మంది మృతిచెందడం వణుకు పుట్టించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 152 కేసులు..మేడ్చల్ 18, రంగారెడ్డి 10, నిర్మల్-యాదాద్రిలో ఐదేసి కేసులు...మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల-నాగర్‌కర్నూలులో రెండేసి కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్, వికారాబాద్, జనగాం, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో ఒక్కో కరోనా కేసు నమోదైంది. తెలంగాణలో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 3వేల496 ఉండగా..ఇప్పటివరకు 123మంది మహమ్మారికి బలయ్యారు. 

ఏపీలో సైతం కరోనా ఉధృతి ఆగడం లేదు. నిన్న కొత్తగా 210 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 12వేల771 మంది నమూనాలు పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే, కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించకపోవడం ఊరట కలిగించే అంశం.  రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4వేల460 కేసులు నమోదు కాగా 73మందిని వైరస్ బలితీసుకుంది. రానున్న రోజుల్లో మరింతగా వైరస్ విస్తరించే ప్రమాదముందని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.