టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్...!

టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్.. ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్...!

 నిజామబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.  నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార టిఆర్ఎస్, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ అధికార టిఆర్ఎస్ అపరేషన్ అకర్ష్ మొదలుపెట్టిందని విపక్షాలు విమర్శిస్తున్నారు. అయితే ఇది అపరేషన్ అకర్ష్ కాదు...అభివృద్ది అకర్ష్ అంటోంది టిఆర్ఎస్.

ఓవైపు, నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను ఈసీ మరో 45 రోజుల పాటు వాయిదా వేసింది. మరోవైపు, ఈ ఉప ఎన్నికకు సంబంధించి అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా.. మంత్రులు, విప్‌లు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామని స్థానిక ప్రజాప్రతినిధులను లోబరుచుకుంటున్నారని, లేదంటే బెదిరిస్తున్నారని ఆరోపిస్తోంది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది.

అటు, బీజేపీ సైతం టీఆర్‌ఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని.. ఎన్నికల కోడ్‌లోనూ ఇతర పార్టీల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చేర్చుకుంటోందని ఆరోపించింది. దేశంలో పార్టీ ఫిరాయింపులకు.. కర్త,కర్మ,క్రియ.. కాంగ్రెస్‌, బీజేపీలేనని కౌంటరిస్తోంది టీఆర్‌ఎస్‌. ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయమంటోంది. 824 మంది ఓటర్లలో 80 శాతం ఓటర్లు తమవైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రజల ఒత్తిడితోనే స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ మారుతున్నారని.. ఇది అభివృద్ధి ఆకర్ష్‌ తప్ప అపరేషన్ అకర్ష్ కాదని తేల్చిచెబుతోంది.