రేవంత్‌రెడ్డి బాధ్యతలపై ఢిల్లీలో నిర్ణయం!

రేవంత్‌రెడ్డి బాధ్యతలపై ఢిల్లీలో నిర్ణయం!

రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చే బాధ్యతలపై త్వరలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోనుందా అంటే... అవుననే సమాచారం. ఇందు కోసం తెలంగాణ కాంగ్రెస్ టాప్ లీడర్స్ ఈ నెల 15వ తేదీన హస్తినకు వెళ్లనున్నారట. అదే రోజు ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి... కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గత ఎన్నికలలో గజ్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా కేసీఆర్‌పై పోటీ చేశారు ఒంటేరు. ఈ సందర్భంగా రాహుల్‌లో కీలక చర్చలు జరపనున్నారు టీపీసీసీ లీడర్స్. ఈ భేటీకి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జానా రెడ్డి, షబ్బీర్‌ అలీ తదితరులు హాజరుకానున్నారు. 

టి.టీడీపీలో కీలక నేతగా, చంద్రబాబుకు నమ్మిన వ్యక్తిగా ఉండి... కొన్ని పరిస్థితులతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఈ మధ్య ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు తనకు చాలా హామీలు ఇచ్చారని... అందుకే కాంగ్రెస్‌లోకి వచ్చానని తెలిపిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా ముఖ్యమంత్రినవుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. రాహుల్‌తో జరిగే సమావేశంలో రేవంత్‌ వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. అయితే రేవంత్‌రెడ్డికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.