అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించింది: మోడీ

అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అవమానించింది: మోడీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరిన వేళ 'అంబేడ్కర్‌'ను బీజేపీ తెరపైకి తెచ్చింది. సమానాభివృద్ధి కోసం అంబేడ్కర్‌  కన్న కలలను కాంగ్రెస్ పార్టీ నీరుగార్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఇవాళ  నమో యాప్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. దళితులకు, వెనుకబడిన తరగతుల వారికి కాంగ్రెస్‌లో స్థానం లేదని, అంబేడ్కర్‌ను ఆ పార్టీ అవమానించిందని అన్నారు. అంబేడ్కర్‌ కల సాకారానికి అహర్నిశలు శ్రమిస్తున్నామన్న మోడీ.. బాబా సాహెబ్‌ కోసం కాంగ్రెస్‌ ఒక్క మంచి పనీ చేయలేదని విమర్శించారు. సమానత్వాన్ని విశ్వసిస్తామని, ప్రతిఒక్కరి అభివృద్ధికీ కట్టుబడి ఉంటామని చెప్పారు. అంబేడ్కర్‌ విలువైన బోధనలను యువతకు అందించేందుకు పనిచేస్తున్నామన్న ఆయన.. ప్రతిఒక్కరూ ఢిల్లీ వచ్చి ఆయన మెమోరియల్‌ను సందర్శించాలని కోరారు. పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారే ఉన్నారని గుర్తుచేశారు.