స్పీకర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతిపత్రం

స్పీకర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతిపత్రం

సీఎల్పీ లీడర్‌ జానారెడ్డి నేతృత్వంలో స్పీకర్‌ మధుసూదనాచారితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలు పునరుద్ధరించాలని ఎమ్మెల్యేలు మధుసూదనాచారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో జానారెడ్డి  మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ఘటనపై వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇద్దరు సభ్యుల శాసనసభ సభ్యత్వాలను రద్దుచేయడం సరికాదన్నారు. అప్రజాస్వామిక నిర్ణయమే నియంతృత్వ ధోరణికి నిదర్శనమని జానా పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాన్ని కోర్ట్ కూడా నమ్మిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వ రద్దు చెల్లదని కోర్ట్ చెప్పినా.. తెలంగాణ ప్రభుత్వం, శాసనసభ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కోర్ట్ నిర్ణయం వచ్చి 50 రోజులు గడిచినా.. శాసనసభ సభ్యత్వాల రద్దు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జానా విమర్శించారు. కోర్ట్ తీర్పును అమలు చేయకపోవడం ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదన్నారు. స్పీకర్ వెంటనే కోర్ట్ తీర్పును అమలు చేసి సభ హుందాతనాన్ని కాపాడాలని కోరారు. స్పీకర్ మధ్యవర్తిగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు. అలా చేయని పక్షంలో తెలంగాణ సభ తీరును దేశ వ్యాప్తంగా తెలిసేలా చేస్తామని జానా హెచ్చరించారు.

స్పీకర్ మధుసూదనాచారి అప్రజాస్వామికంగా నిర్ణయం తీసుకున్నారని.. మొదటి స్పీకర్ ఇలా వ్యవహరించటం సరికాదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారంలో సభ్యుల సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించాలని కోరారు. లేని యెడల రాష్ట్రపతిని కలుస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. 'స్పీకర్ మీద నాకు గౌరవం పోయిందని అని స్పీకర్ కి చెప్పా.. ఇంకా ఎన్ని రోజులు సమయం తీసుకుంటారో చెప్పండని' ప్రశ్నించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే లేకపోవడంతో మా నియోజకవర్గంలో షాది  ముబారక్, కల్యాణ లక్ష్మీ నిధులు మంజూరు చేయలేదని.. దీంతో వాళ్లంతా ఇబ్బంది పడుతున్నారన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో హెడ్‌ఫోన్స్ విసిరి దాడికి పాల్పడ్డారంటూ కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ సభ్యత్వాలను స్పీకర్ మధుసూదనాచారి రద్దు చేసిన విషయం తెలిసింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. ఈ తీర్పుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేయగా వారికి చుక్కెదురైంది. ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్పునిస్తూ.. ఇద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పు వెల్లడించింది.