చ‌ర‌ణ్ మూవీ రిలీజ్ ఎప్పుడు?

చ‌ర‌ణ్ మూవీ రిలీజ్ ఎప్పుడు?

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న తాజా సినిమా రిలీజ్ తేదీపై ప్ర‌స్తుతం సందిగ్ధ‌త కొన‌సాగుతోంది. నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌తో రిలీజ్ తేదీ విష‌య‌మై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న సాగుతోందిట‌. రామ్‌చ‌ర‌ణ్ ఓవైపు మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `సైరా- న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై కొంత సందిగ్ధ‌త నెల‌కొంది. సైరా రిలీజ్‌ ఫిక్స‌య్యేవ‌ర‌కూ తాను న‌టించే సినిమా రిలీజ్ తేదీ ప్ర‌క‌టించ‌వ‌ద్ద‌ని నిర్మాత‌కు సూచించార‌ట‌. 


సైరా సంక్రాంతి బ‌రి నుంచి స‌మ్మ‌ర్‌కి వెళుతుంది అన్న సందేహాలుంటే సంక్రాంతికి త‌న సినిమా రిలీజ్ చేయాలనేది చ‌ర‌ణ్ ప్లాన్‌. ఒక‌వేళ సైరా య‌థాత‌థంగా జ‌న‌వ‌రి 2018లో రిలీజ‌వుతుంది అన్న క్లారిటీ వ‌చ్చేస్తే.. అంత‌కంటే ముందే.. అంటే అక్టోబ‌ర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా రిలీజ్ తేదీ ప్ర‌క‌టిస్తుందేమో చూడాలి.