కలెక్టర్‌ను సాగనంపేందుకు నేతలు చక్రం తిప్పుతున్నారా?

కలెక్టర్‌ను సాగనంపేందుకు నేతలు చక్రం తిప్పుతున్నారా?

మంత్రి జోక్యంతో కలెక్టర్‌, ఎంపీడీవోల మధ్య వివాదం కొలిక్కి!

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కలెక్టర్‌ వర్సెస్‌ అధికారుల పోరు రోజు రోజుకీ తీవ్రమౌతుంది. ఆ మధ్య జడ్పీ సీఈవోను కలెక్టర్‌ దూషించారన్న ఆరోపణలపై ఎంపీడీవోలు సామూహిక సెలవ్‌పై వెళ్లారు. ఈ సమస్య తీవ్రమయ్యే సమయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు.  ఇటు ఎంపీడీవోలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అటు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో వేర్వేరుగా చర్చలు జరిపి వివాదం పెద్దది కాకుండా చూశారు. ఎంపీడీవోలు ఎవరు డ్యూటీలకు వారు హాజరవుతున్నారు. 

దురుసుగా ప్రవర్తించారని కలెక్టర్‌పై మంత్రికి ఫిర్యాదు!

హమ్మయ్య అని అనుకుంటున్న సమయంలో జడ్పీ సర్వసభ్య సమావేశం మరో వివాదానికి  కారణమైంది. సమావేశానికి కలెక్టర్‌ సందీప్‌ హాజరు కాలేదు. అధికారులూ రాలేదు. దీంతో కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుని సమావేశానికి వచ్చిన ప్రజా ప్రతినిధులు  విమర్శలు చేశారు. తాజగా అటవీ అధికారులపై కలెక్టర్‌ దురుసగా ప్రవర్తించారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు సిబ్బంది.  రైతు వేదిక కోసం అటవీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

సింగరేణి నిధుల వినియోగంపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి!

ఇవన్నీ పైకి కనిపిస్తున్న సమస్యలు. కానీ.. తెరవెనుక ఏదో జరుగుతోందని టాక్‌ వినిపిస్తోంది. ఈ కలెక్టర్‌ మాకొద్దు అంటూ తెరవెనుక రాజకీయ నాయకులు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆయన్ని పంపించే లక్ష్యంతోనే ఈ సమస్యలు సృష్టిస్తున్నారని అనుకుంటున్నారు.  ముఖ్యంగా సింగరేణి నిధుల వినియోగంపై  కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇది నేతలకు మింగుడుపడటం లేదట. వారేమైనా  చేతికి మట్టి అంటకుండా కుట్రలు చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. 

కలెక్టర్‌కు మద్దతుగా కొందరు ప్రజాప్రతినిధులు?

జిల్లాలో కొందరు ప్రజా ప్రతినిధులు కలెక్టర్‌కు మద్దతుగా ఉండటంతో.. వారు చెప్పిన పనులు త్వరగా అయిపోతున్నట్లు సమాచారం. దీంతో కలెక్టర్‌, ప్రభుత్వ సిబ్బంది మధ్య రేగిన ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందో లేక.. మరిన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ మొదలైంది. ఎవరు ఎటువైపు అని ఆరా తీస్తున్నారట.  మరి.. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా స్థానం పదిలంగా ఉంటుందో... ఉద్యోగులు, నేతల పంతం నెగ్గుతుందో చూడాలి.