చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోటీ!

చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోటీ!

మీ హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అని కొట్టుకునే అభిమానులను చూశాం. ఆ జిల్లాలో మాత్రం మా ఎమ్మెల్యే గొప్ప అంటే మా ఎమ్మెల్యే గొప్ప అని పార్టీ కేడర్‌ ఓ రేంజ్‌లో చర్చకు తెరతీసింది. మార్కులు కూడా వేస్తున్నారట. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

కరోనా కాలంలో ప్రజల మన్ననలు పొందేందుకు పోటీ!

చిత్తూరు జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతలు, కేడర్‌ చేస్తున్న చర్చ ఒక్కటే. కరోనా టైంలో మా ఎమ్మెల్యే ప్రజలకు చేరువగా ఉంటూ సేవలు చేశారంటే.. కాదు మా ఎమ్మెల్యేనే అని గొప్పలు పోతున్నారట. చిత్తూరు జిల్లాలో 14 స్థానాల్లో కుప్పం మినహా మిగతా 13 వైసీపీనే గెలుచుకుంది.  కరోనా సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ప్రజల ఇళ్ల దగ్గరకే నిత్యావసరాలు, మందులు పంపిణీ చేసి వారి మన్ననలు పొందేందుకు ప్రయత్నించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాదాపు కోట్లు ఖర్చు చేశారట. ఎమ్మెల్యేలు రోజా, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వెంకటయ్య గౌడ్‌లు సైతం ప్రజా సేవలో తరించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిలు తమ అనుచరులతో పనులు కానిచ్చారు. 

సోషల్‌ మీడియాలో అనుచరుల హల్‌చల్‌!

ఈ సమయంలో ప్రజల సేవలో ఉండటం మంచిదే కానీ.. ఆయా ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు చేస్తున్న ప్రచారమే ఇప్పుడు హైలైట్‌ అవుతోంది. మా ఎమ్మెల్యే ఇంత చేశారంటే.. మా ఎమ్మెల్యే అంత చేశారని సోషల్ మీడియా వేదికగా ఊదరగొడుతున్నారు. ఇంకొందరైతే తమ ఎమ్మెల్యే పనితనం పార్టీ పెద్దల దృష్టిలో పడిందని చెబుతూ.. మంచి మార్కులు పడ్డాయని సంబర పడుతున్నారట. అయితే ఈ రేస్‌లో నెంబర్‌ వన్‌ ఎవరన్నదే ఇప్పుడు హాట్‌ హాట్‌గా జరుగుతున్న చర్చ. ఈ సందర్భంగా కరోనా సమయంలో జరిగిన రచ్చలు, కాంట్రవర్సీలు సైతం ప్రస్తావిస్తున్నారట. 

ప్రచారానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు కుమిలిపోతున్నారా?

ఒకటి, రెండు కాంట్రవర్సీలు మినహా మా ఎమ్మెల్యే చేసింది తక్కువేమీ కాదని రోజా అభిమానులు చెబుతున్నారట. పట్టణంలో చేపట్టిన ఓ ర్యాలీ  బ్యాడ్‌ నేమ్‌ తీసుకొచ్చింది కానీ.. లేకుంటే మా నేతే నెంబర్‌ వన్‌ అని మధుసూదన్‌రెడ్డి ఎమ్మెల్యే అనుచరులు వాదిస్తున్నారట. అయితే... ఈ ప్రచారాన్ని చూసిన అధికార పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు లోలోన కుమిలిపోతున్నారని టాక్‌.  తంబళ్లపల్లి, మదనపల్లె, పూతలపట్టు, చిత్తూరు, పీలేరు, సత్యవేడు నియోజకవర్గాలకు చెందిన కేడర్‌.. తమ ఎమ్మెల్యేలు కరోనా సమయాన్ని సరిగా వినియోగించుకోలేదని కామెంట్స్‌ చేస్తున్నారట. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే అసలు కరోనా సమయంలో ఉన్నారో లేదో కూడా తెలియదని అంటున్నారు. 

ఎమ్మెల్యేలకు వచ్చిన మార్కులపై టీడీపీ నేతలు ఆరా?

వైసీపీ కేడర్‌ తమ ఎమ్మెల్యేలకు వేసిన మార్కులపై టీడీపీ నేతలు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. తమకు తెలిసిన నాయకులకు ఫోన్‌ చేసి ఎన్ని మార్కులు వచ్చాయి అని అడుగుతున్నారట. మొత్తానికి  కరోనా సమయంలో చేసిన పనులను అడ్డం పెట్టుకుని మా ఎమ్మెల్యే గొప్ప అంటే మా ఎమ్మెల్యే గొప్ప అని కేడర్‌ మాట్లాడుకోవడం... పోటాపోటీ చర్చలు పెట్టుకోవడం చిత్తూరు జిల్లా ప్రజల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. కరోనా సమయం ఇంకా కొనసాగుతున్నందున అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఈ పోటీ ఇలాగే కొనసాగుతుందో లేదో చూడాలి.