గ్యాస్ లీక్‌ బాధితులకు రూ.31.17 కోట్ల పరిహారం.. ఖాతాల్లో డబ్బులు..

గ్యాస్ లీక్‌ బాధితులకు రూ.31.17 కోట్ల పరిహారం..  ఖాతాల్లో డబ్బులు..

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌ లీక్ బాధితులకు, ప్రభావిత గ్రామాల ప్రజలకు ప్రకటించిన నగదు పరిహారాన్ని సీఎం జగన్ ఆన్‌లైన్‌ ద్వారా వారి ఖాతాల్లోకి జమచేశారు. గ్యాస్ ప్రభావిత ఐదు గ్రామాల్లోని 19,893 మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున పరిహారం అందించారు. గ్యాస్‌ లీక్‌ ఘటనలో ప్రభుత్వం మొత్తం రూ.31.17 కోట్ల నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రాణాలు కోల్పోయిన 12 మంది మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, మూడు రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన 485 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు, ప్రాథమిక చికిత్స పొంది వెంటనే డిశ్చార్జ్ అయిన 99 మందికి 25వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది. సీఎం జగన్ బటన్ నొక్కగానే ప్రకటించిన పరిహారం మొత్తం నేరుగా బాధితుల ఖాతాలోకి చేరింది. 

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించి ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబు గతంలోనూ, 2014 తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కంపెనీ టేకోవర్, విస్తరణకు సంబంధించిన అనుమతులన్నీ లభించాయని ఆయన చెప్పారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదని, ఎవరినీ వేలెత్తి చూపే ప్రయత్నం చేయలేదని సీఎం తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సహాయక కార్యక్రమాలపైనే దృష్టిపెట్టామన్నారు. ప్రమాదం అనంతరం ప్రభుత్వం ఎంతో మానవతా దృక్పథంతో వ్యవహరించిందని, పదిరోజుల వ్యవధిలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించామని జగన్ తెలిపారు.