కేసీఆర్ కీలక నిర్ణయం..వారు తప్ప అందరూ పరీక్ష లేకుండానే పాస్..!

కేసీఆర్ కీలక నిర్ణయం..వారు తప్ప అందరూ పరీక్ష లేకుండానే పాస్..!

కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే అంశాలపై ముఖ్యమంత్రి  ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగు పరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చూడాలన్నారు. దాని ద్వారానే విద్య పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

 విద్యావ్యవస్థ పవిత్రత (academic sanctity)ను కాపాడే ఉద్దేశ్యంతో యుజిసి, ఎఐసిటిఇ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలని సూచించారు. అంతే కాకుండా ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని తెలిపారు. విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.