మన రైతులు పంట పారబోయటం లేదు

మన రైతులు పంట పారబోయటం లేదు

గిట్టుబాటు ధర కల్పించాలంటూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నా మన దగ్గర ఆ పరిస్థితి లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వర్షాకాలం మొదలవుతుండటంతో వ్యవసాయం, నీరు-ప్రగతి తదితర కార్యక్రమాలపై ఆయన ఇవాళ సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రైతులు పంట ఉత్పత్తులను రోడ్ల మీద పారబోయడం లేదంటే.. దీనికి కారణం మనం చేసిన పనులేనన్నారు.  వచ్చే ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి విడుదలపై రైతుల్లో భరోసా పెంచాలని.. సాగునీటిని విడుదల చేసే తేదీలను ముందుగానే ప్రకటించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

పంటకాల్వలను, చెరువులను నీటి నిల్వలకు సిద్ధం చేయాలని..వాటికి యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలని.. రిజర్వాయర్లకు, చెరువులకున్న 750 గేట్లను తనిఖీ చేయాలని అన్నారు. భూగర్భాన్ని అతిపెద్ద జలాశయంగా మార్చుకోవాలని.. జలసంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలని.. మైక్రో ఇరిగేషన్‌ను 4 రెట్లు పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. కోటీ ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని.. వినియోగంలో ఉన్న ధాన్యం రకాలనే వేశాలే రైతులకు అవగాహన కల్పించాలని చంద్రబాబు అన్నారు. రెయిన్ గన్స్, జీబా టెక్నాలజిని వినియోగించుకోవాలని సూచించారు. గతేడాదిలానే ఈ ఏడాది కూడా కృష్ణా డెల్టాకు ముందస్తుగా సాగునీటిని విడుదల చేయాలని.. ఏరువాక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.