ఉద్దానాన్ని టీడీపీలా ఎవరైనా పట్టించుకున్నారా...?

ఉద్దానాన్ని టీడీపీలా ఎవరైనా పట్టించుకున్నారా...?

ఉద్దానం కిడ్నీ బాధితులను టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్నట్లు గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ నిరాహారదీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. దీనిపై ఉదయం అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కిడ్నీ రోగులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించామని.. 13వేల మందికి పైగా క్రమం తప్పకుండా చికిత్స జరుగుతోందని.. ప్రతి నెలా 2761 మంది పేషంట్లకు రూ. 2,500 పింఛన్ ఇస్తున్నామని సీఎం తెలిపారు. రూ. 17 కోట్లతో 7 ఆర్వో సెంటర్లు ఏర్పాటు చేశామని.. ప్రతి 15 రోజులకు ఒకసారి నెఫ్రాలజిస్టుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 5 డయాలసిస్ కేంద్రాలు, 50 డయాలిసిస్ మిషన్లు రోజుకు 3 సెషన్లు పనిచేస్తున్నాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున టీడీపీ ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే కనీసం అభినందించిరా..? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. చేసే వాళ్లనే విమర్శించి.. ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు అంటూ ప్రతిపక్షాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.