చైనా హనీ ట్రాపింగ్..వెలుగులోకి సంచలన విషయాలు ! 

చైనా హనీ ట్రాపింగ్..వెలుగులోకి సంచలన విషయాలు ! 

టెలికాం దిగ్గజం “హువావే” చుట్టూ తాజాగా అల్లుకున్న వివాదం, చైనా గూఢచర్య విధానాలను బయటపెట్టింది.  చైనా తన పనులు నెరవేర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులను, వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ఘటన తేట తెల్లం చేసింది. 

 చైనా గూఢచర్యం ఏ స్థాయిలో ఉంది? ఎలా నడుస్తుంది? ఎవరు నడుపుతారు?
 

ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రతి చైనా కంపెనీలోనూ,  అంతర్గతంగా ఒక విభాగం చైనా ప్రభుత్వం కోసం పని చేస్తుంటుందట. ఈ విభాగం చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీకి జవాబుదారీగా ఉంటుందని అంటున్నారు. ఆయా సంస్థలు తమ దేశ రాజకీయ విధానాలకు అనుగుణంగా నడుస్తున్నాయా? లేదా..!? అనేది ఈ విభాగం నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. ఈ తరహాలోనే, బిజినెస్ ముసుగులో చైనా కమ్యూనిస్టు పార్టీ బ్రిటన్‌ లో కూడా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీకి 9 కోట్ల 30 లక్షలమందికి పైగా సభ్యులున్నారు. వారిలో చాలామంది వివిధ దేశాలలోని చైనా సంస్థల్లో పనిచేస్తుంటారు.

రహస్యాలు సేకరించడానికి ముఖ్యంగా టెక్నాలజీ, టెలికాం రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో వీరు క్రియాశీలంగా ఉంటారని చెబుతున్నారు. విదేశాలలోని కంపెనీలలో పనిచేసే వీరంతా ఏజెంట్లుగా వ్యవహరిస్తుంటారట. వివిధ రకాల పద్దతుల్లో ఆయా దేశాలలోని అధికారులను, రాజకీయ నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారట. అందుకోసం చైనా తన వ్యూహాల అమలులో అనేక ఎత్తుగడలు వేస్తుంది. తమ లక్ష్యం చైనాయేతరుడైన అధికారి అయితే,  పెద్ద మొత్తంలో,  బహుమతుల రూపంలో  ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అక్కడికి వర్కౌట్ కాకపోతే ఆ తరువాత,  అనేక విధాలుగా ప్రలోభ పెట్టడం, బెదిరించడం వంటివి చేస్తుంటారు.

విదేశాల వారికి చైనాలో పెద్దపెద్ద బిజినెస్‌ మీటింగ్‌లకు ఆహ్వానం పంపడం, ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు ధన రూపంలో సాయం చేయడం, లేదంటే ఏ కంపెనీలోనో నాన్‌-ఎగ్జిక్యుటివ్‌ బోర్డ్‌ మెంబర్‌ పదవిని కట్టబెట్టడం, ఒక్కోసారి వారి జీవితమే మారిపోయేంత డబ్బును ఆఫర్‌ చేయడంలాంటి పనులు చేస్తుంటాయని  చెబుతున్నారు. దేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకురావడం, బ్లాక్‌మెయిల్ చేయడం, విదేశీ వ్యాపారులైతే వారికి అమ్మాయిలను ఎరవేయడం(హానీట్రాప్) సర్వసాధారణమట. ఇలాంటివన్నీ చైనా రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంటాయని చెబుతున్నారు.