ఆంక్షలు ఎత్తివేత.. కరోనా ఫ్రీ జోన్‌గా వుహాన్.. కానీ, అదే భయం..!

ఆంక్షలు ఎత్తివేత.. కరోనా ఫ్రీ జోన్‌గా వుహాన్.. కానీ, అదే భయం..!

వుహాన్ ఊపిరి పీల్చుకుంది..! కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో ఆంక్షలను ఎత్తివేసింది చైనా ప్రభుత్వం.. 76 రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌కు ముగింపు పలికింది. లాక్‌డౌన్‌ను ఎత్తివేయడాన్ని వుహాన్ వాసులు పండగలా చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు భారీ భవంతులపై లాక్‌డౌన్ ఎండ్ కౌంట్‌డౌన్‌ను ఏర్పాటు చేశారు. కరోనా ఆంక్షలు తొలగిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. షాపింగ్‌ మాల్స్‌, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ప్రజలు వుహాన్ నుంచి చైనాలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి  వుహాన్ కేంద్ర బిందువుగా మారింది. కరోనా వేగంగా విస్తరించి వేలాది మంది ప్రాణాలు తీసేయడంతో చైనా ప్రభుత్వం వుహాన్‌పై జనవరి 23 నుంచి ఆంక్షలు విధించింది. దాదాపు కోటిన్నర జనాభా ఉన్న వుహాన్ సిటీ అప్పటి నుంచి లాక్‌డౌన్‌లో ఉంది. వుబేయ్ ప్రావిన్స్‌కు రాజధానికిగా ఉన్న వుహాన్‌ సిటీకి ప్రపంచంతో సంబంధాలు తెంచేసింది. అప్పటి నుంచి వుహాన్ వాసులు ఇళ్లకే పరిమితయ్యారు. 76 రోజుల తర్వాత ఆంక్షలను తొలగించారు. అయితే, ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించినా... కరోనా భయం మాత్రం ఇంకా వీడలేదు... రెండోసారి కరోనా విజృంభించే అవకాశాలు లేకపోలేదని చైనా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే వుహాన్‌లో మళ్లీ శవాల కుప్పులను చూడాల్సి వస్తుంది. చైనాలో నమోదైన మొత్తం కేసుల్లో 50వేలకు పైగా వుహాన్‌లో ఉన్నాయి. వుహాన్‌లోనే 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రభుత్వం మాత్రం మళ్లీ ఆస్థాయి పరిస్థితులు రావంటోంది.. అందుకే ప్రస్తుతానికి స్కూల్స్‌ను మినహాయించి మిగతా అన్ని ఆంక్షలను తొలగించింది.