చైనా కంపెనీ చేతికి ఫేస్‌బుక్‌ డేటా?

చైనా కంపెనీ చేతికి ఫేస్‌బుక్‌ డేటా?

సోషల్ మీడియాలో అగ్రస్థానంలో నిలుస్తుంది ఫేస్ బుక్. చాలా మందికి ఎఫ్ బీ ఓ వ్యసనంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఫేస్ బుక్ తన సబ్ స్క్రైబర్ల వ్యక్తిగత వివరాలను థర్డ్ పార్టీ కంపెనీలకు అందజేయడం బహిరంగ రహస్యమే. రోజురోజుకీ ఈ సోషల్ మీడియా దిగ్గజంపై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎఫ్ బీ తన యూజర్ల సమాచారాన్ని సేకరించేందుకు చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ హువావీకి తలుపులు బార్లా తెరిచిందనే వార్తలతో అమెరికా నిఘా, రక్షణ వర్గాలలో కలకలం రేపుతోంది. 

ఈ వారం ఫేస్ బుక్ గురించి ఓ అత్యంత దారుణమైన నిజం బయటపడింది. ఎఫ్ బీ కనీసం నాలుగు చైనా ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థలకు తన వినియోగదారుల సమాచారాన్ని అందజేస్తోంది. చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న టెలికాం పరికరాల తయారీ సంస్థ, హువావీకి ఎంతో కాలంగా ఫేస్ బుక్ అమెరికా సబ్ స్క్రైబర్స్ వివరాలు అందిస్తూ వస్తోంది. అయితే 2010 నుంచి ఫేస్ బుక్ తన యూజర్లు, వారి బంధుమిత్రుల వివరాలను సేకరించేందుకు హువావీ, ఇతర చైనా కంపెనీలను అనుమతిస్తూ వచ్చింది. ఉద్యోగం, వ్యక్తిగత సంబంధాలు, మతపరమైన అంశాలు వంటి కీలక సమాచారాన్ని చైనా సంస్థలు ఎంతో కాలంగా భద్రపరచుకుంటూ వచ్చాయి. దీంతో జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుందని అమెరికా నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇన్నాళ్లూ సాంకేతిక రంగంలో చైనాతో పోటీ పడేందుకు అమెరికాకు తోడ్పడతామని చెబుతున్న ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా సంస్థలు తాజా వార్తలతో ఇరుకున పడ్డాయి. కొన్ని నెలల క్రితమే ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో.. మార్క్ జుకర్ బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందు హాజరై అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్రపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడే ఫేస్ బుక్ ను విడగొడితే చైనా కంపెనీలు బలోపేతం అవుతాయని జుకర్ బర్గ్ వాదించారు. తాజాగా ఈ వారాంతానికల్లా హువావీతో భాగస్వామ్యాన్ని తెగతెంపులు చేసుకుంటామని ఫేస్ బుక్ అంటోంది. అమెరికా, ఈయూ భద్రతా చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడమా లేక విస్తృతమైన చైనా మార్కెట్ కోసం ఇప్పటిలాగే యూజర్ల వ్యక్తిగత డేటాను ఇవ్వడమా అని తేల్చుకోలేక అమెరికా టెక్నాలజీ పరిశ్రమ కొట్టుమిట్టాడుతోంది. 

సోషల్ నెట్ వర్కింగ్ సంస్థలు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థలతో డేటా పంచుకొనే ఒప్పందాలు కుదుర్చుకోవడం చాలా కాలంగా జరుగుతున్నదే. శాంసంగ్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా సామాజిక నెట్ వర్కింగ్ సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే ఇది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని బయటి భాగస్వాములతో పంచుకోరాదని 2011లో కుదిరిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. అందుకే గూగుల్ చైనాలోని తన యూజర్ డేటాను పంచుకోదు. కానీ ఫేస్ బుక్ బీజింగ్ లో ఏర్పాటు చేసిన రీసెర్చ్ విభాగంలో అమెరికా రక్షణ శాఖకు చెందిన పలు ప్రాజెక్టులపై పని చేస్తోంది. దీంతో తమ కీలక సమాచారమంతా చైనా చేతికి చేరుతోందని అమెరికా రక్షణ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.