ఐపీఎల్‌-11 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఐపీఎల్‌-11 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2018 టైటిల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సొంతం చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా పట్టుదలగా ఆడిన ధోనీ సేన ముచ్చటగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని18.3 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి చెన్నై ఛేదించింది. షేన్ వాట్సన్ (117 నాటౌట్: 57 బంతుల్లో 11x4, 8x6) మెరుపు శతకం బాదడంతో అలవోకగా టైటిల్‌‌ని ఎగరేసుకుపోయింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. కెప్టెన్ విలియమ్సన్ (47: 36 బంతుల్లో 5x4, 2x6), యూసఫ్ పఠాన్ (45: 25 బంతుల్లో 4x4, 2x6), కార్లోస్ బ్రాత్‌వైట్ (21: 11 బంతుల్లో 3x6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

ఛేదనలో ఓపెనర్ డుప్లెసిస్ (10) విఫలమైనా.. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన వాట్సన్ మిడిల్ ఓవర్లలో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6, 6, 4 బాదేసి ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. ఇక్కడ నుంచే హైదరాబాద్ చేతుల్లోంచి పూర్తిగా మ్యాచ్ చేజారిపోయింది. ఆఖర్లో  రైనా (32: 24 బంతుల్లో 3x4, 1x6) ఔటైనా.. రాయుడు (16 నాటౌట్: 19 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి వాట్సన్ గెలుపు లాంఛనాన్ని  పూర్తి చేసేశాడు. రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి ఈ ఏడాదే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. 


అవార్డులు..
ఎమర్జింగ్‌ ప్లేయర్‌: రిషబ్‌ పంత్‌ (దిల్లీ) 
ఫెయిర్‌ ప్లే అవార్డు: ముంబై ఇండియన్స్‌ 
బెస్ట్‌ క్యాచ్‌: బౌల్ట్‌ (ఢిల్లీ) 
సూపర్‌ స్ట్రెకర్‌: నరైన్‌ (కోల్‌కతా) 
స్టైలిష్‌ ప్లేయర్‌: పంత్‌ (దిల్లీ) 
పర్పుల్‌ క్యాప్‌: ఆండ్రూ టై (పంజాబ్‌) 
ఆరెంజ్‌ క్యాప్‌: విలియమ్సన్‌ (హైదరాబాద్‌) 
మోస్ట్‌ వేల్యుబుల్‌ ప్లేయార్‌: నరైన్‌ (కోల్‌కతా)