చెన్నై టార్గెట్‌ 179

చెన్నై టార్గెట్‌ 179

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 11వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ గోస్వామి 5 పరుగలకే రనౌటవగా మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌ (26: 25 బంతుల్లో 2x4, 1x6), కెప్టెన్ విలియమ్సన్ (47: 36 బంతుల్లో 5x4, 2x6)  రెండో వికెట్‌కి ధావన్ 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని 9వ ఓవర్లో జడేజా విడదీశారు. ధావన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశారు.  13వ ఓవర్ వేసిన కర్ణ్ శర్మ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ ఆడేందుకు ప్రయత్నించి విలియమ్సన్ స్టంపౌటయ్యాడు.

ఆ తర్వాత షకీబుల్‌ హసన్‌తో జత కట్టిన యూసఫ్‌ పఠాన్‌ స్కోరు వేగాన్ని పెంచాడు. ఇద్దరూ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో 23 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద షకీబుల్‌ను బ్రావో పెవిలియన్‌ బాట పట్టించాడు. వెనువెంటనే దీపక్‌ హుడా 3 పరుగులకే రనౌట్‌ అయ్యాడు. మరోవైపు యూసఫ్‌ పఠాన్‌ మైదానం నలుమూలలా కళ్లు చెదిరే షాట్లు కొట్టాడు. హుడా అవుటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన బ్రాత్‌వైట్‌ తొలి బంతి నుంచే చెలరేగాడు. 20 ఓవర్లు ముగిసేసరికి యూసఫ్‌ పఠాన్‌ (45: 25 బంతుల్లో 4x4, 2x6), బ్రాత్‌వైట్‌ (22: 11బంతుల్లో 3x6) అజేయంగా నిలిచారు. శర్మ, బ్రావో, ఎంగిడి, జడేజా చెరో వికెట్‌ తీశారు.