నేతలకు చంద్రబాబు క్లాస్‌

నేతలకు చంద్రబాబు క్లాస్‌

పార్టీ నేతలంతా నిర్లక్ష్యాన్ని వీడాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఇవాళ అమరావతిలో పార్టీ సమన్వయ భేటీ నిర్వహించారు. ధర్మ పోరాట దీక్షలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు బాబు దిశానిర్దేశం చేశారు.  నేతలు ఎవరేం చేస్తున్నారో తన దగ్గర నివేదికలున్నాయని చెప్పారు. కొంతమంది నేతలు ఇప్పటివరకు సరిగా పనిచేయకపోయినా మారుతారులే అని భావించానని, ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. తాము ఏం చేసినా చెల్లుతుందనుకుంటే పొరపాటేనని అన్నారు. ఇకపై తాను తీసుకునే చర్యలకు నేతలే బాధ్యత వహించాలని బాబు అన్నారు. 
 

సిద్ధంకండి.. 
వచ్చే ఏడాది మే లోగా ఎన్నికలు పూర్తవుతాయని, ప్రీపోన్‌ అయితే ఇంకా ముందుగానే జరుగుతాయని బాబు చెప్పారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక.. వారంలో ఒక్కరోజైనా గ్రమాదర్శని పేరిట నేతలంతా గ్రామాల్లో తిరగాల్సిందేని అన్నారు. మూడో ధర్మ పోరాట సభ రాజమండ్రిలో గోదావరి తీరాన పెడితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. తదుపరి సభ రాయలసీమలో నిర్వహిస్తే మేలని అన్నారు. ఎన్నికల్లోగా అన్ని జిల్లాల్లోనూ ధర్మ పోరాట సభలు పూర్తి చేసేయాలని అన్నారు.