ఎయిరిండియా: పూర్తిగా వదిలించుకుంటారా?

 ఎయిరిండియా: పూర్తిగా వదిలించుకుంటారా?

నష్టాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమాన సంస్థ..ఎయిరిండియాను ఎలాగైనా వదిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొంది. 24 శాతం వాటా ఉంచుకొని 76 శాతం వాటాను అమ్మేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో గంపగుత్తగా 100 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమవుతోంది. ఏఐలో 76 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదని ఆర్ధిక సేవల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్ తెలిపారు.

ఎయిరిండియాలోని పూర్తి వాటాను గంపగుత్తగా ప్రైవేటు సంస్థలకు అమ్మే అవకాశాలు ఉన్నాయని ఆర్ధిక సేవల కార్యదర్శి సుభాష్‌ చంద్రగార్గ్‌ తెలిపారు. దీని ప్రయివేటీకరణ ప్రక్రియపై ప్రధాని తిరిగి ఆలోచన చేయొచ్చని అన్నారు. ప్రభుత్వం నామమాత్రంగా 24% శాతం వాటాను ఉంచుకోవాలన్న నిర్ణయం కారణంగా తమ రహస్యాలు, వ్యూహాలు దాగవన్న భయంతో మహారాజాని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదేమోనని గార్గ్ అభిప్రాయపడ్డారు.

నామమాత్ర వాటా ఉంచుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రయాణికుల్లో విశ్వాసం పెంచాలని భావించిందే తప్ప 24% వాటాను ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన నియమమేదీ పెట్టుకోలేదని.. వాటాల అమ్మకంపై తిరిగి పున: పరిశీంచవచ్చన్నారు.