కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...!

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే...!

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.లాక్ డౌన్ 4.0 పరిస్థితులు, కరోనా వ్యాప్తి వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ తుఫాన్‌పై కూడా కేబినెట్‌లో చర్చించారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన విధానపరమైన నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఎంఎస్‌ఎంఈలకు రూ.3లక్షల ప్యాకేజీని కేంద్రం మరింత విస్తృత పరిచింది. చిన్న పరిశ్రమలకు ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్‌ గ్యారంటీ‌ కల్పించింది. సీనియర్‌ సిటిజన్స్‌కి సాయం చేసే ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని మార్చి 2023 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.డొమెస్టిక్ విమానాలను నడపాలన్న డిమాండ్ బలపడుతున్న తరుణంలో మరో ఐదు రోజుల్లో దేశీయ విమానాలు తిరగబోతున్నాయి. ఈ మేరకు అన్ని ఎయిర్‌ పోర్టులు, విమానయాన సంస్థలకు కేంద్రం సమాచారం అందించింది. 

రైతులకు కేంద్ర కేబినెట్ మరిన్ని రాయితీలు కల్పించింది. ధాన్యం నిల్వలపై పరిమితిని తొలగించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు ఆమోదం తెలిపింది. బొగ్గుగనుల వేలంపై కొత్త విధానానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 8 కోట్ల మంది వలసకార్మికులకు లబ్ధి చేకూరేలా మనిషికి 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలు , రెండు నెలలపాటు ఉచితంగా అందించే బిల్లుకు ఆమోదముద్ర వేసింది.