టొటెమ్‌ ఇన్‌ఫ్రాపై సీబీఐ చార్జిషీట్‌

టొటెమ్‌ ఇన్‌ఫ్రాపై సీబీఐ చార్జిషీట్‌

బ్యాంకులకు రూ. 313.84 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో టొటెమ్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌పై సీబీఐ ఇవాళ చార్జిషీటు దాఖలు చేసింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) నుంచి తీసుకున్న రుణాలను గోల్‌మాల్‌ చేసినట్లు ఇవాళ హైదరాబాద్‌ 14వ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌ కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో సీబీఐ ఆరోపించింది. బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చి 22వ తేదీన సీబీఐ ఎప్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కుంభకోణంలో కంపెనీ డైరెక్టర్లతో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపించింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను అక్రమంగా ఇతర పద్దులకు తరలించారని స్పష్టం చేసింది. 2005 నుంచి 2012 వరకు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, మరో డైరెక్టర్‌ తమలో తాము కుట్ర పన్ని... నిధులను దుర్వినియోగం చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది.కంపెనీకి చెందిన రికార్డులను తారు మారు చేసిన.. వాస్తవ విలువను ఎక్కువ చేసి చూపించి.. బ్యాంకుల నుంచి అధిక రుణం తీసుకున్నారని తెలిపింది. కంపెనీ కోసం తీసుకున్న నిధులను సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని, అలాగే కొన్ని నిధులను అక్రమంగా ఇతర కంపెనీలకు తరలించారని కూడా సీబీఐ పేర్కొంది.