వామ్మో... అంత కరెంట్ బిల్లా... 

వామ్మో... అంత కరెంట్ బిల్లా... 

తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డు తప్పుడు బిల్లులతో జనం గుండెల్లో రెళ్లు పరుగెత్తిస్తోంది. హైదరాబాద్ లోని ఒక గృహ విద్యుత్ వినియోగ దారునికి లక్షల్లో బిల్లు వేసి గుండె గుభేల్ మనిపించింది. నెలకు పట్టుపని రూ. 200 కూడా దాటని ఆ వినియోగదారుడికి ఏకంగా రూ.3,81,571 బిల్లు వేసింది. అది చూసిన ఇంటి యజమాని లబోదిబోమంటూ కరెంటు ఆఫీసుకు పరుగులు పెట్టాడు. అసలు విషయం కరెంట్ ఆఫీసుకు వెళితేగాని తెలియలేదు. అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. స్వరూప హైదరాబాద్ బోడుప్పల్ శ్రీనివాస నగర్ లో నివాసముంటోంది. ఆమె ఇంటికి ప్రతి నెల కరెంటు బిల్లు రూ.200 కంటే మించదు. డొమెస్టిక్ కేటగిరీ కింద కరెంటు సప్లై అవుతోంది. అయితే... మే నెల 9 నుంచి జూన్ 10 వరకు వాడిన బిల్లును చూసి ఆమెకు దిమ్మ దిరిగింది. ఆ బిల్లులో ఏకంగా  40,059 యూనిట్లు వాడినట్లు ఉంది. అందులో రూ. 3,79,087లతో పాటు అదనపు ఛార్జీల కింద రూ. 2,403 వేశారు.

మొత్తం బిల్లు రూ. 3,81,571 వేశారు. జూన్ 24 పేమెంట్ డేట్ గా బిల్లులో ఉంది. దీంతో ఆ మహిళ బిల్లు తీసుకుని కరెంటు ఆఫీసుకు వెళితే అసలు విషయం తెలిసింది. యూనిట్లు నోట్ చేసుకునేందుకు వెళ్లిన సిబ్బంది తప్పుగా నోట్ చేశాడని తేలింది.  పైఅధికారి మరో సిబ్బందిని మళ్లి యూనిట్లు నోట్ చేసుకుని రావాలని ఆదేశించారు. రెండో వ్యక్తి తెచ్చిన యూనిట్లు చూసి అవక్కాయ్యారు. ఎందుకంటే కేవలం 63 యూనిట్లు మాత్రం ఆమె వాడుకున్నారు. అందుకు రూ.134 మాత్రమే బిల్లు అయ్యింది. ఆ బిల్లు చూసిన పైఅధికారులు సైతం అవక్కాయ్యారు.