800 కోట్లతో బర్రెల పంపిణీ.. 50% సబ్సిడీ..

800 కోట్లతో బర్రెల పంపిణీ.. 50% సబ్సిడీ..

తెలంగాణ రాష్ట్రంలో రూ.800 కోట్లతో బర్రెల పంపిణీ పథకం అమలు చేయనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. త్వరలోనే పథకం మార్గదర్శకాలను  విడుదల చేస్తామని, రూ.80వేల విలువైన ఒక్కో బర్రెను 50శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తామని కూడా ఆయన తెలిపారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.3500 కోట్ల వ్యయంతో 58.90 లక్షల గొర్రెలు పంచిన ఘనత తమ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. సంచార వైద్యశాలల సంఖ్య పెంచడంతోపాటు శాఖలో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 

రాష్ట్రంలో 1,332 మంది గోపాలమిత్రలకు త్వరలో వేతనాలు ఇస్తామని ప్రకటించారు. ఈ ఏడాది 80 కోట్ల చేప విత్తనాలను చెరువులు, రిజర్వాయర్లలో వదలాలని నిర్ణయించినట్లు తలసాని వెల్లడించారు. చేపల విక్రయాలు సాగించేందుకు వీలుగా మత్స్యకార సొసైటీ సభ్యులకు 50 వేల ద్విచక్రవాహనాలు అందించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. వనపర్తి(పెబ్బేరు) లో ఇప్పటికే ఫిషరీస్‌ వర్సిటీ ప్రారంభం అయిందని... మరొకటి కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సౌత్‌జోన్‌ విభాగంలో రాష్ట్రీయ గోకుల్‌మిషన్‌ కింద రాష్ట్రానికి వచ్చిన అవార్డును పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీపకుమార్‌ సుల్తానియాకు మంత్రి ప్రదానం చేశారు.