టెక్‌ తప్పు.. 270మంది మహిళలు మృతి

టెక్‌ తప్పు.. 270మంది మహిళలు మృతి

బ్రిటన్‌ ప్రభుత్వ సంస్థకు చెందిన ఓ కంప్యూటర్‌ చేసిన తప్పుకు కనీసం 270 మంది మహిళలు మరణించినట్లు తెలుస్తోంది. నేషనల్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌)కు చెందిన  కంప్యూటర్లు మహిళలను పరీక్షించాయి. అయితే టెక్నికల్‌ సమస్యతో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించినా... సదరు పేషెంట్లకు సమాచారం అందలేదు.  ఎన్‌హెచ్‌ఎస్‌ కింద దేశంలోని 50 నుంచి 70 ఏళ్ళ మధ్య వయస్కులైన మహిళలందరికీ రొమ్ము క్యాన్సర్‌ పరీక్ష చేస్తారు. సుమారు నాలుగున్నర లక్షల మందికి పరీక్షలు జరిపినా... కంప్యూటర్‌ తప్పిదం కారణంగా 68 ఏళ్ళ పైబడినవారికి పరీక్షల వివరాలు అందలేదు. సాధారణంగా ఇలాంటి పరీక్షలు జరపడం వల్ల ఒకవేళ క్యాన్సర్‌ ఉంటే ప్రాథమిక దశలో అరికట్టే అవకాశముంటుంది. కాని ఎన్‌హెచ్‌ఎస్‌ నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో 68 ఏళ్ళు దాటినవారిలో కొందరు  క్యాన్సర్‌తో మరణించి ఉంటారని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 270 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. 4,50,000 మందికి పరీక్షలు జరపగా లక్షన్నర మందికి ఎన్‌హెచ్‌ఎస్‌  నుంచి పరీక్షల రిపోర్టులు  అందలేదు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.