ఏపీ శాసనమండలి రద్దు ఆగినట్టేనా..? ఏం జ‌ర‌గ‌బోతోంది..?

ఏపీ శాసనమండలి రద్దు ఆగినట్టేనా..? ఏం జ‌ర‌గ‌బోతోంది..?

ఏపీ శాసనమండలి రద్దు.. కొన్నిరోజుల క్రితం ఈ ప్రకటన రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టించింది. రాజధాని బిల్లులు సహా ఇంకొన్ని బిల్లులను అడ్డుకునే దిశగా ప్రతిపక్షం వ్యవహరించడంతో శాసనమండలిని రద్దు చేయాలనే దిశగా సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడం.. ఆ మేరకు చకచకా ప్రక్రియ మొదలు పెట్టేయడం.. ఆ తర్వాత వెనువెంటనే శాసనసభలోనూ తీర్మానాన్నిఆమోదించేసి కేంద్రానికి పంపేయడం సూపర్‌ ఫాస్ట్‌గా జరిగిపోయాయి. ఓ విధంగా చెప్పాలంటే ప్రతిపక్షం తేరుకుని ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే ఈ మొత్తం వ్య‌వ‌హార‌మంతా పూర్తయిపోయింది. అయితే, ఇప్పుడు శాసనమండలి రద్దు అంశానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్టే కన్పిస్తోంది. కేంద్రం ఈ అంశాన్నిఇప్పట్లో తేల్చే సూచనలు కన్పించడం లేదనే చర్చ జరుగుతోంది. ఇదే తరహా తీర్మానాలు కేంద్రం వద్ద మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో.. మిగిలిన రాష్ట్రాల్లోని రాజకీయాలను కూడా చూసుకుని కేంద్ర ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలే సూచనలు కన్పించడం లేదనే చర్చ అధికారిక వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఇదే సమయంలో మరో చర్చ తెరమీదకు వచ్చింది. మండలి రద్దుపై కొంచెం పట్టు సడలించాల్సిందిగా పీడీఎఫ్ సహా ఇంకొందరు ఎమ్మెల్సీలు ప్రభుత్వ పెద్దల ద్వారా సీఎం జగన్‌ను కోరినట్టు తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు శాసనమండలి వేదికగా ఉంటోంది. న్యూట్రల్‌ వాయిస్‌ చట్టసభల్లో వినిపించేందుకు ఈ సభలో అవకాశం కలుగుతోందని చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు కాకున్నా.. మరికొన్ని రోజులు ఓపిక పడితే శాసనమండలిలో కూడా వైసీపీదే పైచేయి అవుతుందని.. అత్యధిక స్థానాలు వైసీపీకే వస్తాయని గుర్తు చేసినట్టు చెబుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మండలి రద్దుపై కొంచెం ఆలోచించాలని రిక్వెస్ట్‌ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కంటిన్యూగా అన్నట్టు వైసీపీలో కూడా మండలి రద్దు ఇప్పట్లో జరగదనే చర్చ జరుగుతోంది. దీంతో సీఎం జగన్‌ కొంచెం చూసీ చూడనట్టు వ్యవహరిద్దామని అనుకుంటున్నారా? అన్న చర్చ మొదలైంది.

గతంతో పోల్చుకుంటే వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల కోసం రేస్‌ మొదలైంది. మండలి రద్దుపై సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న క్రమంలో నామినేటెడ్‌ పదవులు ఆశించిన వారు.. ఎమ్మెల్సీ హామీలను పొందిన వారు డీలా పడ్డారు. కానీ ఇప్పుడు వారంతా తిరిగి యాక్టివ్‌ అవుతున్నపరిస్థితి ఉందట. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు వెళ్లడం.. గవర్నర్‌ కోటాలో మరో రెండు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారట.  ఇప్పుడు ఆ నాలుగు స్థానాలను ఎవరు దక్కించుకుంటారా..? అన్న ఆసక్తి నెలకొంది. ఇటీవలే డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేసిన స్థానాన్ని తిరిగి ఆయనకే కేటాయించారు. మిగిలిన నాలుగు స్థానాల కోసం 13 జిల్లాల్లోనూ పోటీ ఉంది. బీసీ, మైనార్టీ, కాపు, ఎస్సీ లేదా ఎస్టీ ఇలా ఈ వర్గాలకు ప్రయార్టీ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో గతంలో ఇచ్చిన హామీలను మరోసారి తెర మీదకు తీసుకురావడం ద్వారా ఇంకొందరు ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారట.