వైఎస్ పాలనను తిరిగి తీసుకురావాలి...

వైఎస్ పాలనను తిరిగి తీసుకురావాలి...

వైఎస్ పాలనను ఏపీ రాష్ట్రంలో తిరిగి తీసుకురావాలని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో పాలనా వ్యవస్థ గాడి తప్పింది, వైఎస్ సంక్షేమ పాలనను రాష్ట్రంలో తిరిగి తీసుకురావాలన్నారు. వైసీపీ అధినేత జగన్ కి అధికార యావ ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.. అవును అధికారంలో ఉంటేనే ప్రజల కోరికలు తీర్చగలం.. అందుకే అధికారంలోకి రావాలనుకుంటున్నామని తెలిపారు. టీడీపీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి  వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇంకో 20 ఏళ్ల పాటు ఏపీ అభివృద్ధికి సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయన్నారు. టీడీపీ నేతలు మట్టి, ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నారు.. ఇసుక, మట్టి నుంచి డబ్బులు సంపాదించవచ్చని టీడీపీ నేతలు నిరూపించారని బొత్స విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. టీడీపీ వల్ల ఏపీ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో.. బీజేపీ కూడా అంతే నష్టం చేసిందన్నారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని బొత్స సత్యనారాయణ అన్నారు. బీజేపీ, వైసీపీకి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని తెలిపారు. కానీ కొందరు వైసీపీ, బీజేపీకి సంబంధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గ్రామ స్థాయిలో టీడీపీ నేతల అవినీతిని విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో వైసీపీ అధికారానికి దూరమైంది.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయంతో అధికారంలోకి వస్తుందని బొత్స  సత్యనారాయణ అన్నారు.