గోదావరిలో ఘోర ప్రమాదం... 35మంది గల్లంతు

 గోదావరిలో ఘోర ప్రమాదం... 35మంది గల్లంతు

గోదావరిలో అతి పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు... పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ బోల్తా పడింది. తీవ్రంగా ఈదురుగాలులు వీయడంతో ప్రమాదం సంభవించింది. దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ బోల్తా పడటంతో 35 మంది వరకు గల్లంతయినట్లు తెలుస్తోంది. 55 మందికిపైగా ప్రయాణిస్తున్న లాంచీ అకస్మాత్తుగా వీచిన సుడిగాలుల కారణంగా నీట మునిగింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే నిర్వాహకులతోపాటు ప్రయాణికులంతా నీట మునిగారు. పలువురు ప్రాణభయంతో హాహాకారాలు చేసినా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. లాంచీపై కూర్చున్న 16 మంది బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. లాంచీలో ప్రయాణిస్తున్న వారు ఎంతమంది అనే విషయంపై ఇంకా స్పష్టత  రాలేదు. ఈదురుగాలులు, భారీ వర్షానికి లాంచీలో నింపిన సిమెంట్‌ బస్తాలు తడిసిపోతున్నాయని భావించిన సిబ్బంది లాంచీ మూడు గదుల తలుపులు మూయడంతో లాంచి మునక ప్రమాదంలో తీవ్రత పెరిగినట్లు సమాచారం.