ఎన్నికల ముందే రాష్టాల్లో పాగా బీజేపీ టార్గెట్

ఎన్నికల ముందే రాష్టాల్లో పాగా బీజేపీ టార్గెట్

మంచి మందు కనిపెట్టి  కరోనాను కూల్చడమేలా  అని మానవాళి తకిందులవుతున్నది. కేంద్రంలో అధికారం చేస్తున్న బిజెపి  మాత్రం వరుసగా ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడం పనిగా పెట్టుకున్నది. కర్ణాటకం నడిపి కుమారస్వామిని కూల్చిన తర్వాత  మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి లాక్‌డౌన్‌ ప్రకటించింది.  ప్రభుత్వాధిపత్యం కోసం ప్రయత్నించి పల్టీ కొట్టిన కాంగ్రెస్‌ నేతల గద్దె నెక్కడం  లక్ష్యంగా అనైతిక వ్యూహాలతో చెలరేగి పోతున్నారు. వారిని కాపాడుకోగల దక్షత, ఐక్యత లేని  కాంగ్రెస్‌  అయోమయంలో కూరుకుపోతున్నది. ఈ రాజకీయ భాగోతానికి ఇప్పుడు రాజస్థాన్‌ వేదికగా మారింది. సచిన్‌ పైలెట్‌ వర్గంపై అనర్హత వేటు పడకుండా హైకోర్టు మరో మూడు రోజుల గడువు నిచ్చింది గనక ఈలోగా ఏం జరుగుతుందో చూడాల్సిందే. ప్రస్తుతానికి బయటపడిన అశోక్‌గెహ్లాట్‌  ప్రభుత్వం పూర్తిగా కాపాడబడిందని  చెప్పడం కష్టం. మహారాష్ట్రలోనూ ఇలాంటి తతంగాలే నడుస్తున్నాయి. అసలే  తికాన లేని ఆంధ్ర ప్రదేశ్‌లోనే అందరికీ కాషాయం పూస్తామని బిజెపి కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ అంటున్నాడు.  


               కేంద్రంలో రెండోసారి గెలిచి దేశమంతా చక్రం తిప్పే మోడీ, అమిత్‌ షా,  నడ్డా త్రయం  ఏవో కొన్ని రాష్ట్రాల్లో   అధికారం కోసం  ఇంత రాజకీయం నడపడం  ఎందుకనేది కీలక  ప్రశ్న. ఎందుకంటే  ఎన్‌డిఎ యేతర పార్టీ చేతిలో ఎక్కువ రాష్ట్రాలు  వుండటం బిజెపికి  పెద్ద అడ్డంకిగా వుంది. యూపీ ఉత్తరాఖండ్‌, గుజరాత్, ‌ హిమచల్‌,  ఫిరాయింపుతో తెచ్చుకున్న ఎంపి, కర్నాటక మినహా బిజెపికి పెద్ద రాష్ట్ర ప్రభుత్వాలేవీ స్వంత పాలనలో లేవు. అసోం,  హర్యానా ఇతరులతో కలిసి పాలించే పరిస్థితి. బీహార్‌లో నితిష్‌ కుమార్‌ కుయుక్తు మధ్య నెట్టుకురావలసిన భాగస్వామ్యం. ఈశాన్యమంతామాదేనంటున్నా ఆ బుల్లి సీమలోనూ  అన్ని అతుకుల బొంత ప్రభుత్వాలే! ఏపీ ,తమిళనాడు,బెంగాల్‌,ఒరిస్సా,మహారాష్ట్ర,ఢల్లీ,తెంగాణ, బలమైన  ప్రాంతీయ పార్టీలు  ఫార్మ్ లోనే వున్నాయి.కేరళలో  సిపిఎం ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం వుంది.  కాంగ్రెస్‌ చత్తీస్‌ఘర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌(ఇంకా)స్వంతంగానూ జార్ఖండ్‌,పాండిచ్చేరి,మహారాష్ట్ర ఇతరులతో కలిసి పాలిస్తున్నది.  ఎన్నికకు ముందు అధికార యంత్రాంగాన్ని వినియోగించుకోవాలన్నా, ఆర్థిక వనరులు  సమీకరించుకోవాలన్నా రాష్ట్ర  ప్రభుత్వాలు లేకపోతే కుదిరేపనికాదు. ఇక  నిధుల  కేంద్రం చేతిలో రూ. 27 లక్షల  కోట్లు వుంటే రాష్ట్రాల్లో  మొత్తం కలిపి రూ.34 లక్షల  కోట్ల వరకూ వుంటాయని ఒక లెక్క. జనాకర్షక  పథకాల  కేటాయింపులు  పారిశ్రామిక వేత్తలను వ్యాపారులను సంతృప్తిపర్చడం వంటి   అవకాశాలు వుంటాయి.మోడీ బొమ్మతో జమిలి ఎన్నికలు జరిపి అన్నీ చేజిక్కుకోవచ్చని ఒకప్పుడు ఆశపడినా పరిస్థితిలో మార్పు వస్తున్నది. కరోనాను ఎదుర్కోవడంలో వైఫల్యం, ఆర్థిక సంక్షోభం,ఉద్యోగాల  ఉద్వాసన హక్కుపై దాడి వంటి చర్యతో మోడీ నాయకత్వంపై అసంతృప్తి కనిపిస్తున్నది. అయోధ్య మందిరం నుంచి అంతర్జాతీయ అంశాల  వరకూ కొత్తపాచికులు  వెతుకుతున్నది. నవంబరులో బీహార్‌ ఎన్నికల తర్వాత బెంగాల్‌ ఈ క్రమంలో కీలక ప్రభావం చూపిస్తాయి..రాజీవ్ ‌ఇందిర ట్రస్టుపై విచారణ, సోనియా కార్యదర్శిఅహ్మద్‌పటేల్‌పై దర్యాప్తు వంటి వాటితో నెహ్రూకుటుంబంపైనే  మోడీ సర్కారు గురి పెట్టడంలోనూ వ్యూహం ప్రతిపక్షం స్థైర్యాన్ని దెబ్బతీయడమే. ఇన్నిటి మధ్యన కాంగ్రెస్‌ తమ రాజకీయ పట్టునుకాపాడుకోవడం పెద్ద సవాలే. ప్రజాప్రయోజనాల  ప్రజాస్వామ్య లౌకిక పరిరక్షణ ఇంకా ముఖ్యం.

 

తెలకపల్లి రవి