సోము వీర్రాజుగారూ, ఏపీ ఎజెండాలో ఇది మొదటి పాయింటు

సోము వీర్రాజుగారూ, ఏపీ ఎజెండాలో ఇది మొదటి పాయింటు

తెలకపల్లి రవి

బిజెపి ఏపీ అద్యక్షుడుగా కన్నా లక్ష్మినారాయణ స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమాకంపై  రాజకీయ హడావుడిలో ఒక తమాషా వుంది. టిడిపి గీకుడు వైసీపీ దూకుడు మధ్య ప్రతిదీ వివాదంగా మారే నేపథ్యంలో బిజెపి నూతన అద్యక్షుడి గురించి కూడా ఈ రెండు పార్టీ కోణంలో చర్చులు నడుస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగానే ఈ ఎంపిక జరిగిందన్న వాదన  ఒకటైతే వైసీపీకి అనుకూలతకు సంకేతమని మరో వాదన. బాధ్యతులు స్వీకరించిన సోము వీర్రాజు జనసేనతో కలసి తామే మూడవ ప్రత్యామ్నాయంగా వస్తామనీ, 2024లో తమ కూటమి అభ్యర్థికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ప్రకటించేశారు. చంద్రబాబు తమ పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించారనీ, తాము కూడా ఆయనను ఆవిధంగానే చూస్తామని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పిదాను విమర్శిస్తూనే గతంలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి కూడా కృషిచేస్తామన్నారు. పోలవరం నిధులు రాబట్టడానికి సహకరిస్తామంటూనే గతంలో ఇచ్చిన దానికి లెక్కులు రావాలన్నారు. వైసీపీ టీడీపీలు రెండు కళ్లయితే తాము త్రినేత్రులుగా వ్యవహరిస్తామన్నారు. పురాణాల్లో శివుడు మూడోకన్ను తెరవడమంటే భస్మం చేయడమేనని వీర్రాజు గారి గమనంలో వుందో లేదో  ఎవరిపై తెరుస్తారో చెప్పలేము. 

 

ఏమైనా  కేంద్రపాలక పార్టీగా జాతీయ పార్టీగా బిజెపి విధానాలు  వ్యూహాలు కేవలం రాష్ట్ర అద్యక్షుపైనే ఆధారపడి వుండవు.పైగా విభజనానంతర ఎపిలో  బిజెపి పాత్ర పరిపరివిధాలు మారుతున్న పరిస్థితి. 

 

ఎపివిభజనలోనూ తర్వాత పరిశేషరాష్ట్రానికి జరగాల్సిన న్యాయాన్ని నిరాకరించడంలో బిజెపి కూడా  ప్రధాన పాత్రధారి. గత ప్రభుత్వ హయాంలో తప్పులనూ వెలికి తీస్తామని సోము వీర్రాజు అన్నప్పుడు నాలుగేళ్లు వారు కూడా అందులో భాగస్వాముని గుర్తుంచుకోవాలి. విభజన హామీలు నెరవేర్చడంలోనూతెలంగాణ ఎపి సమస్యులు వివాదాలు  పరిష్కరించడంలోనూ రాజధానికి పోలవరంకు నిధులు సమకూర్చడంలోనూ రాయలసీమకు నిధులు నిరంతరాయంగా విడుదల చేయడంలోనూ మోడీ ప్రభుత్వ వాగ్దానాలు చాలా స్వల్పంగానే అమలయ్యాయి. ఢీల్లీని తలదన్నే రాజధాని సమకూర్చుకోవడానికి సహకరిస్తామన్న ప్రధాని అమరావతి భ్రమరావతిగా మారడంలో తమ వంతు పాత్ర పోషించారు. రెవెన్యూలోటును భర్తీ చేస్తామన్నది అరకొర విదిలింపుగా ముగిసింది. ప్రత్యేకహోదా ప్రత్యేక మిథ్యగా మారింది. 

 

కారకులెవరైనా సరే హోదాకు  బదులుగా ప్రకటించిన ప్యాకేజీ టాకేజీగా ఆగింది. అప్పుడు వైసీపీ ఇప్పుడు టిడిపి కూడా  కేంద్రాన్ని వదలిపెట్టి అధికారంలో వున్న ప్రత్యర్తిపార్టీపైనే దాడి కేంద్రీకరించడంతో బిజెపి రాజకీయ క్రీడ తేలికైంది.  గత ఎన్నికల సంవత్సరం సందర్భంలో టిడిపి పేరిట ప్రభుత్వ ఖర్చుతో జరిపిన ధర్మయుద్ధం ప్రహసనంగా మారి ప్రజల విశ్వాసం పొందలేకపోయింది. ఓడిపోయిన మరునాటి నుంచి టిడిపి అధినేత ప్రధాని మోడీకి వంతపాడటమే పనిగాపెట్టుకున్నారు. పార్లమెంటు సీట్లిస్తే  కేంద్రం మెడులు వంచుతామన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారానికి ముందే అది జరిగేది కాదని చేప్పేశారు. 2019లో వామపక్షాలతో కలసి ఈ ముగ్గురిపై పోరాడిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బిజెపితో చేతులు కలిపారు. మూడు ప్రాంతీయ పార్టీలు తన చుట్టూ తిరుగుతున్నపరిస్థితిని అవకాశంగా తీసుకున్న బిజెపి కేంద్ర రాష్ట్ర నేతులు రకరకాల ప్రకటనలతో ప్రచారాలతో ప్రజలను తికమకకు గురి చేశారు. జగన్‌ ప్రభుత్వ విధానాల పట్ల ,రాజధాని మార్పు పట్ల పోలవరం నిర్మాణ నిధులు పట్ల ఏ సమస్య తీసుకున్నా బిజెపి శిబిరం నుంచి పులు విధాల సంకేతాలు విడుదల కావడంపరిపాటిగా మారింది. కన్నా లక్ష్మినారాయణ చాలా విషయాల్లో తీవ్రమైన ప్రకటనలు చేయడం ఆ వెంటనే జివిఎల్‌ నరసింహరావు రాం మాధవ్‌ వంటివారు భిన్నస్వరం వినిపించడం చూశాం. ఇక వైసీపీ నేతులు బిజెపిని విమర్శించే బదులు అదంతా టిడిపికి ఆపాదించడం రివాజైంది.  

 

రాష్ట్ర గవర్నర్‌గా వున్న విశ్వభూషణ్‌ హరిచందన్‌ బిజెపి సీనియర్‌ నాయకుడైనా హోం శాఖ ఆధ్వర్యంల్లో పనిచేస్తున్నా ఆయన ఆమోదించే బిల్లులు తీసుకునే నిర్ణయాలపై కూడా బిజెపి ద్వంద్వ భాషణమే చేస్తున్నది. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఉద్వాసన, రాజధాని వికేంద్రీకరణవంటి అంశాలలో ఇది ప్రస్పుటమైంది. బిజెపి అనుకూల ముద్రతో ఒకరు అమరావతి జెఎసి చైర్మన్‌గా నియమితులై అంతా ఆగిపోతుందని ప్రధాని కార్యాలయం పేరిట హామీలు గుప్పించారు. ఎంపి సుజనా వంటివారూ చెప్పారు. తమ పార్టీ వికేంద్రీకరణకు అనుకూలం కాగా సిఆర్‌డిఎ బిల్లును ఆమోదించవద్దని లేఖ రాసినందుకే కన్నాను తప్పించారని ఆపార్టీలో బలమైనవర్గాలు చెబుతున్నాయి. కొంతమంది ప్రతినిధుల పై కూడా బిజెపి అధిష్టానం చర్య తీసుకుంది. బయిటి నుంచివచ్చినవారికి సంస్థాగత నాయకత్వం ఇవ్వరాదని తెలంగాణ లో బండి సంజయ్‌ని ఎంపిక చేసినట్టే  ఎపిలో సోమువీర్రాజు సంఘ పరివార్‌ నేపథ్యంతోనే నియమితులైనారు. పార్లమెంటులో వైసీపీ  మద్దతు ఉపయోగపడుతుంది గనక అటూ ఇటూ తిప్పిమాట్లాడుతున్నా అది తాత్కాలికమే. అమరావతిని దక్షిణాది అయోధ్యగా మారుస్తామని ఒకరు ప్రవచించారు.  మత వివాదాలు పెంచేప్రయత్నాలు తిరుమల వివాదాలు కూడా కూడా ప్రయోగించారు. సోషల్ ‌ఇంజనీరింగ్‌ వ్యూహంగా ఒకటి రెండు  సామాజిక వర్గాలనూ పునాదిగా మార్చుకునే ప్రయత్నం  సోము వీర్రాజు నియామకంలో స్పష్టం. ఏది ఏమైనా గత ఆరేళ్లుగా ఎపికి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దకుండా బిజెపి ప్రజల విశ్వాసంపొందడం కష్టం. కొత్త వాగ్దానాలు చేసే ఏపీ బిజెపినేత గత వాగ్దానభంగాలను చక్కదిద్దడంపై దృష్టిసారించాలి.