పొరుగు రాష్ట్రాలకు కర్ణాటక ఎమ్మెల్యేలు?

పొరుగు రాష్ట్రాలకు కర్ణాటక ఎమ్మెల్యేలు?

కర్ణాటకలో హంగ్ ఏర్పడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో 104 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా.. ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు 8 మంది ఎమ్మెల్యేల మద్దతుకు దూరంగా నిలిచిపోయింది. ఒక  ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు తెలపడంతో బీజేపీ పార్టీకి ఇంకా 7 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఇతర పార్టీ మ్మెల్యేలపై కన్నేసింది. అదే సమయంలో కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలు వుంటే.. ఏ క్షణంలో ఏ ఎమ్మెల్యే జారిపోతాడోనన్న భయం బీజేపీకి ఉంది. ఈ కారణంతోనే బీజేపీ తమ ఎమ్మెల్యేలను తమిళనాడుకు తరలించేందుకు  సిద్ధమవుతోంది.

మరోవైపు బీజేపీకి కుర్చీ అందకుండా చేసేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌ల కూటమి నానా తంటాలు పడుతున్నాయి. ఈ సమయంలో తమ ఎమ్మెల్యేలను కాపాడు కునేందుకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే బెంగళూరు శివారులో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్‌కు పంపగా.. జేడీఎస్ ఎమ్మెల్యేలు నగరంలోని షంగ్రిల్లా  హోటల్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ నేతలు తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా వుండేందుకు పుదుచ్చేరికి తరలిస్తారని సమాచారం. ఇక జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ కు తరలించే యోచనలో ఉన్నారని సమాచారం.