అమరావతిపై బీజేపీ కొత్త ప్లాన్ రెడీ చేసిందా?

అమరావతిపై బీజేపీ కొత్త ప్లాన్ రెడీ చేసిందా?

అది 200 రోజులుగా సాగుతున్న ఉద్యమం. అలాంటి ఆందోళనలో సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. అయోధ్య తరహా రామాలయం నిర్మిస్తామనే ప్రకటన వెలువడింది. ఇలా ప్రకటన వచ్చిందో లేదో.. అలా ఇద్దరు ఎంపీలు విరాళాలు ప్రకటించేశారు. ఆలూ లేదు.. చూలూ లేదు అన్న చోట ఈ ప్రతిపాదనేంటి? ఇది వ్యూహమా.. రాజకీయ ఎత్తుగడా? లెట్స్‌ వాచ్‌.

ఆన్‌లైన్‌ ర్యాలీకి హిందూ మహాసభ ప్రతినిధులు హాజరు!

అమరావతినే రాజధానిగా ఉంచాలని రైతులు ఉద్యమం చేస్తున్నారు. 200 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. మొదటి వంద రోజుల ఉద్యమం ఉధృతంగానే జరిగింది. కరోనా వల్ల ఆ ఉధృతి నెమ్మదించింది. స్థానికులు ఇళ్ల దగ్గరే ఉండి నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనలు 200 రోజులకు చేరిన సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల వారు సంఘీభావం తెలిపారు. అమరావతి పరిరక్షణ JAC నిర్వహించిన కార్యక్రమంలో రాజకీయ, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ విధానంలోజరిగిన ఈ సంఘీభావ ర్యాలీకి అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. 

అయోధ్య తరహా రామాలయం !

ఈ సందర్భంగా హిందూ మహాసభ ప్రతినిధి చక్రపాణి మహారాజ్‌ అమరావతి ప్రాంతంలో రామాలయ నిర్మాణంపై ఓ ప్రకటన చేశారు. అయోధ్య తరహాలో ఇక్కడ కూడా రామాలయం నిర్మిస్తామని చెప్పారు. చక్రపాణి మహారాజ్‌ ఇలా ప్రకటన చేశారో లేదో.. వైసీపీలోని అసంతృప్తి ఎంపీ  రఘురామకృష్ణం రాజు లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్లు చెప్పారు. తాను పది లక్షల విరాళం ఇస్తానని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ట్వీట్‌ చేశారు. 

హిందూ మహాసభ ఎందుకు తెరపైకి ? 

అసలు అమరావతి ఏమౌతుందో తెలియని పరిస్థితుల్లో సడెన్‌గా హిందూ మహాసభ ఎందుకు తెరపైకి వచ్చింది? ఇప్పటి వరకూ ఈ ప్రాంతానికి పెద్దగా పరిచయం లేని సంస్థ ఎందుకు ఆలయ ప్రస్తావన చేసింది అన్నది ఆసక్తిగా మారింది. హిందూ మహాసభ ప్రకటన తర్వాత అంతే వేగంగా ఇద్దరు ఎంపీలు విరాళాల  ప్రకటన సైతం చర్చకు దారితీసింది. 

హిందూ మహాసభ, రాజధాని ఉద్యమాలకు సంబంధం లేదు!

అమరావతిలో ఆథ్యాత్మిక వ్యవహారాల ద్వారా బీజేపీ కొత్త చర్చకు ప్లాన్‌ చేసిందా? తమ కార్యక్రమాలకు ఏ మాత్రం సంబంధం లేనిచోట హిందూ మహాసభ రామాలయం అని ఎందుకు ఘనంగా ప్రకటించింది? అని కొందరు ఆరా తీస్తున్నారట. వాస్తవానికి హిందూ మహాసభ కార్యక్రమాలకు, రాజధాని కోసం జరిగే ఉద్యమాలకు ఏ మాత్రం సంబంధం లేదు. అయినా ఆ సంస్థను తెరపైకి తీసుకురావడం రాజకీయ వ్యూహంలో భాగమనే చర్చ జరుగుతోంది. 

ఎవరిపై ఒత్తిడి తేవాలని అనుకుంటున్నారు?

ఈ ప్రాంతంలో ఇప్పటికే టీటీడీ నేతృత్వంలో భారీ దేవాలయ నిర్మాణం జరగబోతుంది. అలాంటిది ఇప్పుడు  రామాలయం ప్రస్తావన ఎందుకు వచ్చిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. ఇది హిందువుల ప్రాంతం అని చెప్పడం ద్వారా ఎవరిపై ఒత్తిడి తేవాలని అనుకుంటున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది. కొత్త రాజకీయ చర్చకు ఎందుకు తెరతీశారనే దానిపై చెవులు కొరుక్కుంటున్నారు. 

ఎంపీ స్థాయి వ్యక్తుల స్పందన వ్యూహంలో భాగమా?

హిందూ మహాసభ ప్రకటన తర్వాత బీజేపీ నేతలు వేగంగా స్పందించడంపైనా చర్చ మొదలైంది. రాజధాని ఉద్యమంలో అటునుంచి నరుక్కువచ్చే ప్రయత్నమా లేక.. కాకతాళీయంగా  జరిగిందా అనేది  తెలియాల్సి ఉంది. ఆలూ లేదు.. చూలూ లేదు అన్నట్లు ఎంపీ స్థాయి వ్యక్తులు స్పందించిన తీరులో ఏదో వ్యూహం  ఉందనే చర్చ మాత్రం రన్‌ అవుతోంది. మరి ఆ వ్యూహం ఏంటో కాలమే చెప్పాలి.