అందుకే బిగ్‌ బాస్‌లో పాల్గొంటున్నా...

అందుకే బిగ్‌ బాస్‌లో పాల్గొంటున్నా...

బిగ్ బాస్ 2 షోలో ఐదో పార్టిసిపెంట్ గా ప్రముఖ హేతువాది, మానవ హక్కుల కార్యకర్త.. బాబు గోగినేని ప్రవేశించారు. ఎప్పుడూ చర్చలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే బాబు గోగినేని బిగ్ బాస్ 2లో పాల్గొంటారని ఎవరూ ఊహించలేదు. అయితే కోట్లాది మంది చూసే బిగ్ బాస్2 ద్వారా హేతువాదాన్ని ప్రచారం చేసే అవకాశం కలిగిందని హౌస్ లోకి వెళ్లబోయే ముందు చెప్పారు బాబు గోగినేని. 

బిగ్ బాస్ 2లో ఎవరూ ఊహించని వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. హేతువాదంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బాబు గోగినేనిని బిగ్ బాస్2 హౌస్ లో ఐదో పార్టిసిపెంట్ గా ప్రకటించారు. తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రతిరోజూ మాయమంత్రాలకు వ్యతిరేకంగా, మానవ హక్కుల కోసం పోరాడుతూ కనిపించే బాబు గోగినేని సుప్రసిద్ధులు.

నిజానికి బాబు గోగినేని తన ఫేస్ బుక్ ఖాతాలో అనివార్య కారణాల వల్ల తను కొన్ని నెలలపాటు పోస్టులు పెట్టనని రాశారు. అది చూసి ఆయన బిగ్ బాస్2లో ప్రవేశిస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి. చివరకు అవే నిజమయ్యాయి. 

అంతకు ముందు కూడా బాబు బిగ్ బాస్2పై తన ఆసక్తిని చాటుకున్నారు. దానిని ఓ సామాజిక ప్రయోగంగా అభివర్ణించారు. ఎంపిక చేసిన కొందరిని పదుల సంఖ్యలో కెమెరాలు దగ్గరగా గమనిస్తున్నపుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అక్కడున్న మిగతా వారితో మీ వ్యవహార శైలి ఏంటి? అనేది ఒక మంచి ప్రయోగం అని అభిప్రాయపడ్డారు. 

బిగ్ బాస్ హౌస్ లో ఓ ప్రెషర్ కుక్కర్ వాతావరణం సృష్టిస్తారని.. వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా జట్టుగా మరో జట్టుతో పోటీ పడటం రెండు జట్లు ఒకే జట్టులోవే కావడం వంటి మానసిక ప్రయోగాలు ఇందులో ఉన్నందువల్ల అందులో పాల్గొనడం ఆసక్తికరంగా ఉంటుందని తన ఇంట్రెస్ట్ బయటపెట్టుకున్నారు బాబు గోగినేని. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక పార్టిసిపెంట్స్ మామూలుగా మారతారా? లేక విచిత్రంగా ప్రవర్తిస్తారా? అనేది కూడా పరిశీలించదగిన అంశమని అన్నారు. 

తను విదేశాల్లో బిగ్ బాస్ మూలం బిగ్ బ్రదర్ చూసినప్పటి  నుంచి దీనిని ఓ సామాజిక ప్రయోగంగా భావిస్తూ వచ్చానని.. ఇప్పుడు అనుకోకుండా నిర్వాహకులు తనను సంప్రదించగానే అంగీకారం తెలియజేసినట్టు బాబు గోగినేని తెలిపారు. వార్తా ఛానెళ్లలో గంటల కొద్దీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో చూడరని.. అదే ఇలాంటి కార్యక్రమాన్ని కోట్లాది మంది చూస్తారు కనుక బిగ్ బాస్2 ద్వారా తను హేతువాదాన్ని ప్రచారం చేస్తానని తెలిపారు బాబు గోగినేని.