జగన్ మాటిచ్చి మడమ తిప్పారు !

జగన్ మాటిచ్చి మడమ తిప్పారు !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేశారని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నరు. ఏపీ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రైతుల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు. తమ హయాంలో రైతులకు రుణమాఫీ చేసి చూపించామన్నారు. కానీ జగన్ రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.6వేలు మాత్రమే ఇచ్చారని అన్నారు. మాట మీద నిలబడండి మడమ తిప్పకండని జగన్ కి బాబు సూచించారు. వ్యవసాయానికి తీసుకున్న వారందరి రుణాలు మాఫీ చేసిన ఘనత మాదేనన్న ఆయన జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి..  కానీ చేతలు మాత్రం లేవని అన్నారు.

రైతు భరోసా పథకం గురించి మాట్లాడమంటే వైసీపీ సభ్యులు ఎక్కువ మంది తనను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారని, అందుకు రిప్లై ఇచ్చి తన సమయం వృథా చేసుకోదలచుకోలేదని బాబు అన్నారు. ఇక ‘వ్యవసాయం దండగ’ అని తాను అన్నట్టుగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను బాబు ఖండించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ‘వ్యవసాయం దండగ’ అన్న వ్యాఖ్యలు తాను చేసినట్టు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై ఆరోపణలు చేశారని, నిరూపించమని ఆయనకు సవాల్ విసిరితే  మాట్లాడకుండా తప్పించుకున్నారని గుర్తుచేసుకున్నారు. వైసీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు.