వాట్సాప్‌కి పోటీగా పతంజలి 'కింభో' యాప్...

వాట్సాప్‌కి పోటీగా పతంజలి 'కింభో' యాప్...

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఢీకొట్టేందుకు పతంజలి సిద్ధమవుతోంది... స్వదేశీ ఉత్పత్తుల నినాదంతో కన్జ్యూమర్ గూడ్స్ విభాగంలో నమ్మకమైన బ్రాండ్‌గా నిలదొక్కుకున్న పతంజలి... మొన్న ఈ మధ్యే టెలికం రంగంలోకి అడుగుపెట్టింది. టెలికాం రంగంలోనూ స్వదేశీయతను చాడమే లక్ష్యంగా ప్రభుత్వరంగ సంస్థ భారత బీఎస్ఎన్ఎల్‌తో జతకట్టి ‘స్వదేశీ సమృద్ధి సిమ్’ కార్డ్స్ పేరిట సిమ్ కార్డులను విడుదల చేశారు బాబా రాందేవ్... ఇక పతంజలి సిమ్ కార్డు కొనుగోలు చేసినవారికి రూ.2.5 లక్షల మెడికల్ ఇన్స్యూరెన్స్, రూ.5 లక్షల జీవిత బీమా కూడా ప్రకటించారు. కాగా, తాజాగా ప్రపంచంలోనే టాప్ స్పాట్‌లో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఢీకొట్టేందుకు 'కింభో' పేరుతో సరికొత్త మెసేజింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది.

పతంజలి సారథ్యంలో కొనసాగే ఈ యాప్‌ను యోగా గురు బాబా రామ్‌దేవ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ యాప్ వాట్సాప్‌కు గట్టి పోటీ ఇవ్వనుందంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు పతంజలి ప్రతినిధులు. ఇది మన స్వదేశీ మెసేజింగ్ వేదిక అని... గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు... అని తెలిపారు. ఇక పతంజలి కింభో... వాట్సాప్‌కి గట్టి పోటీ ఇవ్వడం కాయమంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. ఈ 'కింభో' యాప్‌కు... ‘‘ఇప్పుడు భారత్ మాట్లాడుతుంది..’’ అంటే ట్యాగ్‌లైన్ పెట్టడం విశేషం.