ఈ కార్ల జోరు ఇంతింత కాదయా...

ఈ కార్ల జోరు ఇంతింత కాదయా...

భారత రోడ్లపై గేర్ లెస్ కార్లు దూసుకుపోతున్నాయి. మూడు నాలుగేళ్లుగా గేర్ లెస్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండే మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో గేర్ లెస్ కార్లు బాగా అమ్ముడుపోతున్నాయి. చౌకైన, మెరుగైన సామర్థ్యం గల ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్(ఏఎంటి) వంటి టెక్నాలజీలు రావడంతో కార్ల తయారీదారులు గేర్ లెస్ వాహనాల తయారీపై దృష్టి పెట్టారు. తేలికగా నడిపే వీలు, వినియోగదారుల స్థోమత స్థాయి పెరగడంతో కొన్నేళ్లుగా ఆటోమెటిక్ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 

మునుపటితో పోలిస్తే ఆటోమేటెడ్ కార్ల ధరలు కాస్త తగ్గాయి. అలాగే సామర్థ్యం, మైలేజీ కూడా బాగా మెరుగయ్యాయి. అంతకు ముందు కారుని ఒక్క వ్యక్తి మాత్రమే వాడేవారు. ఇప్పుడు కుటుంబ సభ్యులంతా వాడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో కార్ల వినియోగం పెరిగింది. దీంతో మహిళలు సులువుగా నడిపే వీలున్న గేర్ లెస్ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఆటోమేటెడ్ కార్లకు పెరిగిన డిమాండ్ ను గుర్తించించిన మారుతి, ఇతర కార్ల ఉత్పత్తి సంస్థలు చౌకగా గేర్ లెస్ కార్లు తయారు చేసేందుకు ఏఎంటీ టెక్నాలజీపై దృష్టి సారించాయి. హ్యుందయ్ చిన్న కార్ల విభాగంలో శాంట్రో స్థానంలో సరికొత్తగా ఏఎంటీ కార్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరికల్లా ఈ కొత్త కారు మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. 

నాలుగేళ్ల క్రితం 5,400 గేర్ లెస్ కార్లను అమ్మిన మారుతి, 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 28 రెట్లు ఎక్కువగా ఒకటిన్నర లక్షల ఆటోమెటిక్ కార్లను అమ్మింది. ఇప్పుడు మారుతి అమ్మకాల్లో గేర్ లెస్ కార్లు దాదాపుగా 10% ఉన్నాయంటే ఏ స్థాయిలో ఆటోమెటిక్ కార్లకు డిమాండ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది గేర్ లెస్ కార్లు మరిన్ని అమ్ముడవుతాయని మారుతి ధీమా వ్యక్తం చేస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షలకు పైగా ఏఎంటీ కార్లను అమ్ముడవుతాయని మారుతి మార్కెటింగ్, సేల్స్ విభాగం అంచనా వేస్తోంది. 

హ్యుందయ్ సంస్థ గేర్ లెస్ కార్ల అమ్మకాలు కూడా పెరిగాయి. 2015లో 4 శాతం మాత్రమే ఉన్న ఆటోమెటిక్ కార్ల అమ్మకాలు 2017లో 8 శాతం మేర వృద్ధి చెందాయి. హోండా కార్ల అమ్మకాల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. గత ఏడాది హోండా పెట్రోల్ కార్ అమ్మకాల్లో 27 శాతం ఉన్న గేర్ లెస్ కార్ల అమ్మకాలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 35 శాతానికి పెరిగాయి.