పెన్షన్ రూ.10 వేలు...?

పెన్షన్ రూ.10 వేలు...?

అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం కింద అందిస్తున్న పింఛనును రూ.10,000 పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు ఈ మొత్తం రూ.5,000గా ఉండేది. అసంఘటిత రంగ ఉద్యోగులకు ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీనిని 2015-16 బడ్జెట్లో ప్రకటించింది. ప్రభుత్వ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏపీవై స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి గడువు తర్వాత నెలకు రూ.10వేల పెన్షన్‌ లభిస్తుంది. ఏపీవై కింద అందించే పెన్షన్‌ విలువ పెరగాల్సి ఉందని ఆర్థిక సేవల డిపార్ట్‌మెంట్‌ జాయింట్‌ సెక్రటరీ మాద్నేష్ కుమార్ మిశ్రా చెప్పారు. పెన్షన్‌ రెగ్యులేటరీ సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్వహించిన సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. 

నెలవారీ పెన్షన్‌ను రూ.10వేల వరకు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు మాద్నేష్ కుమార్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద అందించే పెన్షన్‌ ఐదు శ్లాబుల్లో ఉంది. మార్కెట్‌ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ పరిశీలించిన తర్వాత రాబోయే 20-30 ఏళ్లలో రూ.5000 పెన్షన్‌ సరిపోదని తెలిసినట్టు మిశ్రా చెప్పారు. 18 ఏళ్లు నిండినవారు ఏపీవైలో పెట్టుబడి పెట్టవచ్చు. నెలవారీ, త్రైమాసికం, అర్థ సంవత్సరం చొప్పున ఏపీవైకి చెల్లించవచ్చు. 

పెన్షన్‌ పరిమితి పెంపుతో పాటు ఆటో ఎన్‌రోల్‌మెంట్‌, ఈ స్కీమ్‌లో ప్రవేశానికి గరిష్ట వయసును 50 ఏళ్ల వరకు పెంచడం ప్రతిపాదనలను పీఎఫ్‌ఆర్‌డీఏ.. ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. ఏపీవైకి  ప్రస్తుతం ఈ స్కీమ్‌కు 40 ఏళ్లే గరిష్ట వయసుగా ఉంది. మరో 10 ఏళ్ల పెంపుతో సబ్‌స్క్రైబర్‌ బేస్‌ను మరింత పెంచవచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ పెన్షన్‌ పథకానికి 1.02 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2017-18లో కొత్తగా 50 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు.