పోల"వారం"

పోల"వారం"

పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.   ఈ ప్రాజెక్టులో కీలకమైన డయా ఫ్రమ్‌ వాల్ జెట్ గ్రౌటింగ్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జూన్ 11లోగా డయా ఫ్రమ్‌ వాల్‌తో పాటు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన జెట్ గ్రౌటింగ్ పనులు కూడా పూర్తికానున్నట్లు వారు సీఎంకు వివరించారు. అమరావతి సచివాలయం నుంచి పోలవరం ప్రాజెక్టుపై 60వ సారి ప్రాజెక్టు పురోగతిపై వర్చువల్ రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా కాంక్రీటు పనుల్లో వేగం మందగించటంపై నిర్మాణ సంస్థలను బాబు ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా.. అనుకున్న సమయానికి పనులను పూర్తి చేసి తీరాలని వారికి సూచించారు.

ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 53.50శాతం పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు 89.6 శాతం, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 59.60 శాతం, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్ మట్టి పనులు 73.2 శాతం మేరకు పూర్తయినట్లు వివరించారు. స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు 21.83 శాతం మేరకు పూర్తయ్యాయని తెలిపారు. గోదావరి కుడిగట్టు నుంచి డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం 91 శాతం వరుక పూర్తయిందని చర్చించారు. జూన్ 11 తేదీ లోగా దీనిని మొత్తం పూర్తి చేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ పనులు 70 శాతం పూర్తయ్యాయని.. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు కూడా 60.28 శాతం మేర పూర్తి చేశామని వివరించారు. మిషనరీలో తలెత్తిన సమస్యలతో కాస్త వెనుకబడినట్లు నిర్మాణ సంస్థలు వివరించగా... ఏ నెలకు సంబంధించిన టార్గెట్ వర్క్ ను అదే నెలలో పూర్తి చేయాలని వారిని ఆదేశించారు.