నేడు సీఎం ధర్మపోరాట దీక్ష

నేడు సీఎం ధర్మపోరాట దీక్ష

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... తన పుట్టినరోజు నాడే ధర్మపోరాట దీక్షకు దిగి రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై గళమెత్తారు. ఇక ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టారు. కాగా, నేడు విశాఖ వేదికగా మరోసారి ధర్మపోరాట దీక్షకు దిగనున్నారు ఏపీ సీఎం. ఈ దీక్షలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దీక్ష ప్రారంభమయ్యే అవకాశం ఉండగా... మూడు జిల్లాల నుంచి కార్యకర్తలు, నేతలు పెద్దసంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. స్థానిక ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో దీక్షతో పాటు బహిరంగసభ కూడా నిర్వహించనున్నారు.