ఆగమ శాస్త్రం గురించి టీషర్ట్ వేసుకుని చెబుతారా..?

ఆగమ శాస్త్రం గురించి టీషర్ట్ వేసుకుని చెబుతారా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులు రమణ దీక్షితులపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల ఆలయ వ్యవహారాల్లో రమణ దీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావు, ప్రతిపక్షాల తీరుకు నిరసనగా విజయవాడలో బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పాలాభిషేకం చేసి లెనిన్ సెంటర్‌లోని విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆనందసూర్య మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ ప్రభుత్వం పన్నిలో కుట్రలో రమణ దీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావులు పావులుగా మారారన్నారు. వెయ్యకాళ్ల మండపం విషయంలో... ఇష్టపూర్వకంగా సంతకం చేసిన రమణ దీక్షితులు.. ఇప్పుడు అది తప్పు అంటున్నారని.. ఆగమ శాస్త్ర గొప్పతనాన్ని ఆయన టీషర్ట్స్ వేసుకుని చెబుతారని విమర్శించారు. అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డి ఇంటికెళ్లి ఆశీర్వచనం చేశారని.. నాడు ఏడు కొండలు కాదు.. రెండు కొండలేనని వైఎస్ జీవో ఇచ్చినప్పుడు రమణ దీక్షితులు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. టీటీడీ నిబంధనల ప్రకారం 2013లో అనేకమంది అర్చకులు రిటైర్ అయినప్పుడు రమణ దీక్షితులు మాట్లాడారా..? అని విమర్శించారు. బ్రాహ్మాణ వర్గాలను టీడీపీకి దూరం చేయాలనే బీజేపీ, వైసీపీ కుట్ర పన్నుతున్నాయని ఆనందసూర్య ఆరోపించారు.