అంకాపూర్ చికెన్‌...పేరు వింటేనే లొట్టలు !

అంకాపూర్ చికెన్‌...పేరు వింటేనే లొట్టలు !

అదిరిపోయే గుమగుమల వంటకం అది.. ఆ గ్రామం మీది నుంచి వెళ్లే ఎవరైనా.. ఆ వంటకం టేస్ట్ చేయ్యాల్సిందే. కరోనా కాలంలోనూ ఆ కర్రీకి ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ఇంతకీ ఏంటా వంటకం?. దానికి ఎందుకు అంత క్రేజ్. ?  నాటు కోడి ఏక్కడ తిన్నా టేస్ట్ గానే ఉంటుంది. కానీ అంకాపూర్ దేశీ చికెన్ ప్రత్యేకతే వేరు. కర్రీ వండేప్పుడు వచ్చే వాసనకే నోరూరి పోతుంది. ఈ అంకాపూర్ దేశీ చికెన్ కోసం జిల్లా వాసులే కాదు ఇతర జిల్లాల నుంచి మరీ ఎగబడతారు. సీఏం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యాటనకు ఎప్పుడు వచ్చినా అంకాపూర్ దేశీ చికెన్ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. 
 
అంకాపూర్ వ్యవసాయంలోనే కాదు.. దేశీ చికెన్ విషయంలోనూ అత్యంత గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం కరోన కాలంలోనూ అంకాపూర్ చికెన్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గడంలేదు. అన్ని వ్యాపారాలతో పాటు హోటల్ రంగం కుదేలైనా.. అంకాపూర్ దేశి చికెన్ హోటల్స్‌కు మాత్రం గిరాకీ తగ్గలేదు. ఒక్కసారైనా టేస్ట్ చెయ్యాలనే ఉద్దేశంతో జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి చికెన్‌ రుచి చూస్తారు. 
 
ఈ దేశీ చికెన్‌లో వాడే ఆయిల్‌ దగ్గర నుంచి మసాలా వరకూ అన్నీ స్పెషలే. కర్రీలో రుచి కోసం కల్తీ నూనెలు కాకుండా.. మంచి ఖరీదైన.. నాణ్యమైన నూనెనే వాడుతారు. ఇక కర్రీలో వేసే మసాలా మొత్తం కర్రీలో హైలైట్‌గా ఉంటుంది. ఈ మసాలా కోసం షాపుల్లో దొరికే పాకెట్లను నమ్ముకోకుండా ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. కొబ్బరి అల్లంతో పాటు పలు రకాల దినుసులు వేసి మసాలా తయారు చేస్తారు. ఇక ఈ చికెన్‌ వండే పాత్ర కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. కర్రీ వండటానికి ఎంచుకునే కోడి దగ్గర నుంచి అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి. 

చాలా స్పైసీగా ఈ వంటకం చేస్తారు. అర్డర్ ఇస్తే 20 నుంచి 30 నిమిషాల్లో వండిపెడతారు. కేజీ చికెన్‌కి కేజీ రైస్ కూడా ఇస్తారు. దీని ఖరీదు 650 రూపాయలు ఉంటుంది. 150 రూపాయలతో మొదలైన ఈ చికెన్‌ రేటు ఇప్పుడు 650 రూపాయలకు చేరింది. ఏదైనా పనికోసం అంకాపూర్ వచ్చిన వారు.. దేశీ చికెన్‌ను టేస్ట్ చేయ్యనిదే ఇక్కడి నుంచి వెళ్లరు. అంకాపూర్‌కు ఎవరైనా అతిథి వచ్చాడంటే.. అక్కడ దేశీ చికెన్ ఆర్డర్ కొట్టాల్సిందే. ఈ మధ్య నేతలు కూడా ఈ పాపులర్ చికెన్‌ను తెగ ఇష్టపడి తినేస్తున్నారు. 

ఈ దేశీ చికెన్‌లో వేసే మసాలాకు ఎంతటివారైనా ముగ్ధులవ్వాల్సిందే. ఒకసారి టేస్ట్‌ చూశాక మరి కొంచెం.. మరికొంచెం అంటూ బొర్ర నిండా లాగించేంత వరకూ అక్కడ నుంచి కదలరు. హైదరాబాద్‌ సహా అనేక ప్రాంతాల నుంచి ఆ చికెన్‌ కోసం వెళ్తుంటారు. ఫోన్ల ద్వారా కూడా ఆర్డర్లు ఇచ్చి వంట పూర్తయ్యాక వచ్చి తీసుకెళ్తుంటారు. అంకాపూర్ దేశీ చికెన్‌కు డిమాండ్ పెరగటంతో.. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ బ్రాంచీలు తెరిచారు. అంకాపూర్ దేశీ స్పెషల్ అంటూ అమ్మకాలు ప్రారంభించారు. అంకాపూర్‌ రాలేని భోజన ప్రియుల కోసం బ్రాంచీలు ఏర్పాటు చేసి ఆ టేస్ట్ చికెన్ వంటకాన్ని అందిస్తున్నారు.